లగ్గం టైం రివ్యూ: కిడ్నాప్ డ్రామా.. అదిరింది
పెళ్లి అంటేనే హడావుడి.. ఆ హడావుడిలో పెళ్లికొడుకు మాయమైతే? ఆ కిడ్నాప్ కేసులో హీరోయిన్ పాత ప్రియుడు ఇరుక్కుంటే? ఇలాంటి క్రేజీ పాయింట్‌తో రూపొందిన చిత్రమే 'లగ్గం టైం'. రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పెళ్లి గోల ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించిందో సమీక్షలో చూద్దాం.
కథ:
అనన్య (నవ్య చిట్యాల), చంద్ర (సుదర్శన్) ల పెళ్లి వేడుకతో కథ మొదలవుతుంది. సరిగ్గా పెళ్లి సమయంలో అనన్య మాజీ ప్రియుడు సూర్య (రాజేష్ మేరు) అక్కడికి వస్తాడు. ఎలాగైనా అనన్యను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ, పెళ్లింట్లో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల భయపడి తన ఫ్రెండ్‌తో కలిసి అక్కడి నుండి పారిపోతాడు. అదే రోజు ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉండటంతో సూర్య ఆఫీస్‌కు వెళ్తాడు.
కట్ చేస్తే.. పెళ్లి పీటల మీద ఉండాల్సిన పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఇటు ఇంటర్వ్యూలో సూర్య తన లవ్ స్టోరీ చెప్తుండగా, పోలీసులు వచ్చి చంద్రను కిడ్నాప్ చేసింది సూర్యనే అని అరెస్ట్ చేస్తారు. అసలు చంద్రను ఎవరు కిడ్నాప్ చేశారు? సూర్యకు ఈ కిడ్నాప్‌కు సంబంధం ఏంటి? పుణేలో మొదలైన సూర్య-అనన్యల ప్రేమ కథ ఏ తీరానికి చేరింది? అన్నదే మిగతా ఆసక్తికర కథ.

విశ్లేషణ
పెళ్లి నేపథ్యంలో కిడ్నాప్ డ్రామాలు కొత్తేమీ కాకపోయినా, దర్శకుడు ప్రజోత్ ఈ కథను రాసుకున్న విధానం, స్క్రీన్ ప్లేలో చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంటాయి. పెళ్లింట్లో జరిగే హడావుడితో సినిమా సరదాగా మొదలవుతుంది. మొదటి 20 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగినా, కథ పుణే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాక వేగం పుంజుకుంటుంది. సూర్య-అనన్యల లవ్ స్టోరీ సింపుల్ గా, క్యూట్ గా సాగుతూ యూత్‌ను అలరిస్తుంది.ద్వితీయార్ధంలో కథనం మరింత ఆసక్తికరంగా మారుతుంది. పెళ్లికొడుకు కిడ్నాప్ చుట్టూ తిరిగే ట్విస్టులు, కామెడీ ట్రాక్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు చంద్ర (సుదర్శన్) లవ్ ట్రాక్ కూడా యాడ్ చేయడంతో కథలో కొత్తదనం వచ్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా, దాన్ని ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటుల ప్రతిభ:
హీరోగా సూర్య పాత్రలో రాజేష్ ఒదిగిపోయాడు. లవ్ సీన్స్ లోనూ, ఎమోషనల్ సీన్స్ లోనూ పరిణతి చూపించాడు. తెలుగమ్మాయి నవ్య తన క్యూట్ లుక్స్‌తో, సహజమైన నటనతో మెప్పించింది. అనన్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది.పెళ్లికొడుకుగా చంద్ర పాత్రలో సుదర్శన్ తనదైన టైమింగ్ తో బాగా నవ్వించాడు. సినిమా భారమంతా తన భుజాలపై మోశాడు.ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్, ప్రీతీ సుందర్, కేదార్ శంకర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాలు:
సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కొన్ని సాంగ్స్ వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని, అక్కడక్కడా అనవసరమైన కామెడీ సీన్స్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా షార్ప్ గా ఉండేది. నిర్మాణ విలువల పరంగా కె. హిమబిందు ఎక్కడా రాజీ పడలేదని స్క్రీన్ మీద కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
లీడ్ పెయిర్ నటన
సుదర్శన్ కామెడీ
సెకండ్ హాఫ్ ట్విస్టులు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సాగదీసినట్టు అనిపించే ప్రారంభ సన్నివేశాలు
కొన్ని రొటీన్ ఎమోషనల్ సీన్స్
చివరి మాట:
మీరు రొటీన్ యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా, సరదాగా సాగే ఒక 'యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్' చూడాలనుకుంటే 'లగ్గం టైం' కు ఖచ్చితంగా వెళ్లొచ్చు. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీతో కూడిన సరదా కిడ్నాప్ డ్రామా.
రేటింగ్: 2.5/5












Click it and Unblock the Notifications