లక్ష్మీపార్వతి అన్నం కలిపి తినిపించేవారు.. బర్త్ డేకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు !!
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా.. నిర్మాతగా, గాయనిగా, వ్యాఖ్యాతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమె.. ప్రస్తుతం ముంబైకి మకాం మార్చారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)తో తనకున్న అనుబంధం గురించి ఆమె వివరించారు.

కాగా మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ మోహన్ బాబు నిర్మాణ సంస్థలోనూ సినిమాలు చేశారు. ఈ వృత్తిపరమైన సాన్నిహిత్యం కారణంగా మంచు కుటుంబ పిల్లలు ఎన్టీఆర్‌కు చాలా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మి ఎన్టీఆర్ గురించి తన బాల్యపు జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్టీఆర్ అంకుల్ ఇంటికి రెగ్యులర్‌గా వెళ్లేదాన్ని. ఆయనను అంకుల్ అని పిలుస్తా. ఆయనకు చాలా క్లోజ్. మా ఇంటికి వెళ్ళినట్లే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సీఎం అయ్యాక కూడా తరచుగా ఆయన ఇంటికి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా పెద్ద గ్లాసు నిండా పాలు ఇచ్చేవాళ్ళు. కానీ అవి తాగడానికి కష్టపడేదాన్ని. లక్ష్మి పార్వతి కూడా నన్ను చిన్న పిల్లలా బాగా చూసుకునేవారు. రాత్రి పూట డిన్నర్ టైంకి వెళ్తే ఆవిడే అన్నం కలిపి ఎన్టీఆర్ కి నాకు తినిపించేవారు. ఒకసారి నా పుట్టిన రోజుకు బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి నాకు గిఫ్ట్ ఇచ్చారని అందరూ కుళ్లుకున్నారని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఒకసారి నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు తరగతిలో మీకు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా తెలుసా అంటే నేను ఎన్టీఆర్ తెలుసు అని చెప్పానన్నారు. దీంతో అందరూ షాక్ అయ్యారని.. తన క్లాస్ మేట్స్ అందరిని దాదాపు ఒక 50 మందిని ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇప్పించానని వివరించారు. అపుడు ఎన్టీఆర్ అందరికీ ఫుడ్ పెట్టించారని మంచు లక్ష్మి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications