మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య, ఎన్టీఆర్... పెద్దాయన రాయబారం?
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈనెల ఆరోతేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పోస్టర్ ను విడుదల చేశారు. సినీ ప్రియులను, నందమూరి అభిమానులను అందరినీ ఇది ఆకట్టుకుంది. ఈ సినిమాను గ్రాండ్ గా తీర్చిదిద్దాలనే యోచనలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉన్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్వినితోపాటు ఎస్ఎల్వీ పతాకంపై సంయుక్తంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. పురాణాలను, సోషల్ కథాంశంతో ముడిపెట్టి తీయబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారు.
శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య
ఆ ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యున్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తారక్ తోపాటు కల్యాణ్ రామ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో ఇద్దరు స్టార్లు ఉండాలని బాలయ్య తలపోస్తున్నారు. ఇందులో భాగంగా తాను శ్రీకృష్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

విభేదాలు విడనాడాలంటూ హితవు
ఇటీవల సినిమాల్లో క్యామియో పాత్రలకు ప్రాధాన్యత పెరిగింది. సినిమాలు హిట్ అవడంలో క్యామియో పాత్రలో పోషించిన నటుల పాత్ర కూడా ప్రధానంగా ఉంటోంది. అటువంటి క్యామియో పాత్రలు మోక్షజ్ఞ సినిమాలో కూడా ఉండాలనేది బాలయ్య ఆలోచన. జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబ సభ్యులకు, బాలయ్యకు మధ్య కొన్నాళ్ల నుంచి విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా తారక్ ఏమాత్రం స్పందించలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే రాజకీయాలకు, సినీరంగానికి చెందిన ఓ వ్యక్తి వీరి మధ్య రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. జరిగిందేదో జరిగిపోయిందని, ఇలా విభేదాలతో వీధినపడే బదులు హుందాగా కలిసివుంటే ఎన్టీరామారావు పేరు చెక్కుచెదరకుండా నిలిచివుంటుందని, సినీ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే కలిసివుండటమే మంచిదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తారక్ కూడా ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఉందంటున్నారు. కొద్దిరోజులు ఆగితేకానీ దీనిపై ఓ స్పష్టత వచ్చేలా లేదు.












Click it and Unblock the Notifications