ప్రభాస్... నువ్వు నిజంగా మహా‘రాజు’వయ్యా!
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాత క్షేమాన్ని ముందుగా ఆలోచించే అరుదైన వ్యక్తిత్వం ప్రభాస్‌ది. తనను నమ్మి పెట్టుబడి పెట్టిన వారు నష్టపోకూడదనే ఆలోచన ఆయన మనస్తత్వంలో లోతుగా నాటుకుపోయింది. అదే గుణం ఆయనను పరిశ్రమలో అందరికీ 'డార్లింగ్'గా మార్చింది. బాక్సాఫీస్ రికార్డులు ఎలా ఉన్నా, కష్టాల్లో ఉన్న నిర్మాతకు అండగా నిలబడటంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.
పారితోషికాన్ని కూడా సర్దుబాటు చేశాడు
ఇటీవల 'రాజా సాబ్' ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఎదుర్కొన్న ఆర్థిక భారాన్ని ప్రభాస్ తన బాధ్యతగా భావించారు. ఆ నష్టాన్ని పూడ్చేందుకు విశ్వప్రసాద్‌తో మరో సినిమా చేస్తానని మాటివ్వడమే కాకుండా, ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే పట్టాలెక్కించేలా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ప్రభాస్ ను డీల్ చేయగలిగే కథ, దర్శకుడిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం విశ్వప్రసాద్ దే. అంతేకాదు, నిర్మాతకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేశారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం 'స్పిరిట్' పంపిణీ హక్కులు మైత్రీ మూవీస్‌తో పాటు విశ్వప్రసాద్‌కి కూడా దక్కేలా స్వయంగా చొరవ తీసుకున్నారు. దీని ద్వారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశముంది. ఇది తొలిసారి కాదు. గతంలో 'ఆదిపురుష్' సమయంలో కూడా సినిమా హక్కులు కొని విశ్వప్రసాద్ తీవ్రంగా నష్టపోవడంతో రాజా సాబ్ సినిమా చేసిపెట్టారు. అలాగే ఆ సినిమా పంపిణీదారుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని తన పారితోషికాన్ని కూడా సర్దుబాటు చేసిన ఘనత ప్రభాస్‌దే.
వారి పరంపరను కొనసాగిస్తున్నాడు
ఇదొక్కటే కాదు.. తనతోపాటు షూటింగ్ లో వందల మంది ఉన్నా వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టించే ప్రభాస్ చేస దానధర్మాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పారితోషికంద్వారా వస్తున్న డబ్బులను స్నేహితులకు ఉపయోగపడేలా యూవీ క్రియేషన్స్ బ్యానరుపై సినిమాలు చేయిస్తున్నారు. ఆదపలో ఉన్నవారికి సాయం చేస్తున్నారు. తనను నమ్ముకున్న నిర్మాతలెవరూ నష్టపోకూడదనే ఒకే ఒక్క మనస్తత్వం నిజంగా ప్రభాస్ ను మహారాజును చేస్తోంది. అభిమానులైతే నువ్వు రాజువయ్యా..మహారాజు వయ్యా అంటున్నారు. అందుకే ప్రభాస్ కేవలం బాక్సాఫీస్ రాజు మాత్రమే కాదు... నిర్మాతలను కాపాడుకునే మనసున్న మహారాజు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలు పరిశ్రమ సంక్షేమం కోసం ఎలా నిలబడ్డారో, అదే పరంపరను ఈ తరం లో ప్రభాస్ కొనసాగిస్తున్నాడు.












Click it and Unblock the Notifications