అంచనాలను అందుకోలేకపోతున్న 'పుష్ప2'?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో భారీగా విడుదలవబోతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీతోపాటు బెంగాలీలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో 5వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పర్యటనలు
సినిమా ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ మొత్తం దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీంతోపాటు విదేశాల్లో కూడా పర్యటించాలనే ప్రణాళిక రచించారు. ఓవర్సీస్ లో పుష్ప2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నార్త్ అమెరికాలో దాదాపు 3వేల షోలు వేయబోతున్నారు. ఈ షోల నుంచి 4.50 లక్షల డాలర్లు వచ్చాయి. కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంబంధించి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. వీటిల్లో రెగల్, ఏఎంసీ తదితర చిత్రాలున్నాయి. ఓవర్సీస్ లో కల్కి, దేవర చిత్రాలకు 500 షోలు వేస్తే వచ్చిన డబ్బు పుష్ప2కు 3వేల షోలు వేస్తున్నా రావడంలేదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే కనీసం ఒక మిలియన్ డాలర్లు అయినా దాటివుండాలికానీ అలా జరగకపోవడంతో ట్రేడ్ పండితులు అయోమయానికి గురవుతున్నారు.

25 మిలియన్ డాలర్లు రావాలి
ఉత్తర అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే 25 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది. అంత డబ్బు రావాలంటే విడుదల రోజే ప్రీమియర్స్ తోపాటు మొదటిరోజు వేసే అన్ని షోలకు కలిపి ఆరు మిలియన్ డాలర్లను అందుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న క్రేజ్ ప్రకారం చూస్తుంటే 4 మిలియన్ డాలర్లే వచ్చేటట్లున్నాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ సినిమాకు మంచి టాక్ రాకపోతే అవి కూడా రావంటున్నారు. దీంతో బయ్యర్లు ముందు, వెనక ఆడుతున్నారు.
టికెట్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది
అంతేకాకుండా సినిమా టికెట్ ధరలు కూడా భారీగా పెట్టారు. ఒక్కో టికెట్ 35 డాలర్లంటే మన రూపాయల్లో మూడువేల రూపాయలకింద లెక్క. టికెట్ ధరలు తగ్గిస్తే ప్రీమియర్ షోల గ్రాస్ బాగా వస్తుందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పుష్ప2 నుంచి దేవిశ్రీప్రసాద్ కు బదులుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థమన్ లేదంటే అజనీష్ అందిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు షూటింగ్ పూర్తయిందా? లేదంటే నిర్మాత, దర్శకులు అలా చెబుతున్నారా? ఇంత హడావిడి ఎందుకు పడుతున్నారు? అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా? లేదా? అనే ఆందోళనలో అల్లు అర్జున్ అభిమానులున్నారు.












Click it and Unblock the Notifications