14 ఏళ్ల అజ్ఞాతవాసం.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
నేటి తరం సినీ అభిమానులకు రీమా సేన్ అంటే ముఖం గుర్తుంటుంది కానీ పేరు వెంటనే తట్టకపోవచ్చు. కానీ 2000వ దశకంలో ఆ పేరు ఒక సెన్సేషన్. ఆమె ముఖం కుర్రకారు గుండెల్లో అచ్చుపడిపోయిందంటే అతిశయోక్తి లేదు. అక్టోబర్ 29, 1981న కోల్‌కతాలో జన్మించిన రీమా సేన్.. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఫాల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియోల ద్వారా ఇంటింటికీ పరిచయమైన ఆమె.. 2000లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఉదయ్ కిరణ్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, రీమా సేన్‌కు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది.
తమిళంలో 'వాసిగర' గర్ల్‌గా గుర్తింపు
తెలుగులో విజయాలు అందుకుంటున్న సమయంలోనే తమిళంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'మిన్నలే' (తెలుగులో చెలి) చిత్రంలో నటించారు. ఆర్. మాధవన్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం.. ముఖ్యంగా అందులోని 'వాసిగర' (తెలుగులో నా హృదయంలో) పాట ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఇప్పటికీ రొమాంటిక్ పాటల లిస్టులో ఆ పాట టాప్‌లో ఉంటుంది. ఆ పాటతో ఆమె 'వాసిగర' గర్ల్‌గా తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిపోయారు.

'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్'తో ముగింపు
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. రీమా సేన్ తన నటనతోనూ ఆకట్టుకున్నారు. 'ఆయిరత్తిల్ ఒరువన్' (యుగానికి ఒక్కడు) సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక హిందీలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' (2012)లో దుర్గా అనే పవర్‌ఫుల్ పాత్రలో మెరిశారు. దురదృష్టవశాత్తు అదే ఆమె చివరి సినిమా అయ్యింది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం.. కుటుంబం కోసం గుడ్ బై
చాలా మంది హీరోయిన్లు కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ రీమా సేన్ మాత్రం భిన్నమైన బాట ఎంచుకున్నారు. 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. 2013లో కొడుకు రుద్రవీర్ సింగ్ జన్మించిన తర్వాత తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుత జీవితం ఎలా ఉంది?
గత 14 ఏళ్లుగా రీమా సేన్ మీడియా వెలుగులకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివిటీ చాలా తక్కువ. తన భర్త, కుమారుడే ప్రపంచంగా ఆమె ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. గ్లామర్ ప్రపంచం కంటే కుటుంబంతో గడిపే సమయమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని సన్నిహితులతో ఆమె పేర్కొన్నట్లు సమాచారం. 2000వ దశకంలో తన సహజ సిద్ధమైన నటనతో అలరించిన రీమా సేన్, ఇప్పటికీ తన పాత సినిమాల ద్వారా అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచే ఉన్నారు.












Click it and Unblock the Notifications