తెలుగు సినిమా చరిత్రలో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ ఏదో తెలుసా?
తెలుగులో ఎన్నో వందల సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. అంటే అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఒక కొత్త చరిత్రను సృష్టించడం అన్నమాట. అంటే తెలుగు సినిమా చరిత్రలో ఆ సినిమా ఒక పేజీని లిఖించుకుంటుంది. దాన్ని ఇండస్ట్రీ హిట్ అంటారు. అటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలా తెలుగులో తొలిసారిగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసుకుందాం. ఎందుకంటే దాన్ని సాధించింది ఎవరో ఆషామాషీ హీరో కాదు.. తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభాల్లో ఒకరైన నందమూరి తారకరామారావు.
అతి పెద్ద కమర్షియల్ ఎంటర్ టైనర్
1977లో విడుదలైన ఈ సినిమా ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. క్లాస్ సినిమాల నుంచి మాస్ సినిమాలవైపు తెలుగు సినిమాలను మలుపు తిప్పిన మొదటి సినిమా అడవి రాముడు. తారకరామారావు, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది.
అప్పటివరకు పౌరాణికాలు, జానపదాలు లేదా కుటుంబ కథా చిత్రాలకు పరిమితమైన తెలుగు సినిమాను.. పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా మార్చిన ఘనత అడవిరాముడిదే. అడవి నేపథ్యంలో సాగే యాక్షన్, గ్లామర్, సెంటిమెంట్ కలగలిసిన ఈ ఫార్ములా ఆ తర్వాత దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను శాసించిందని చెప్పొచ్చు.

బాక్సాఫీస్ బాహుబలి
ఈ సినిమా 30 కేంద్రాలలో 100 రోజులు, 16 కేంద్రాలలో 175 రోజులు, 4 కేంద్రాలలో ఏడాది పాటు ఆడింది. అప్పట్లోనే ఈ సినిమా సుమారు 4 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లో మొదటి 'ఇండస్ట్రీ హిట్'లలో ఒకటిగా నిలిచింది. 60 ఏళ్లకు దగ్గరపడుతున్న వయసులో కూడా ఎన్టీఆర్ చూపించిన ఎనర్జీ, డ్యాన్స్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ ఈ సినిమాతో రెట్టింపు అయ్యింది. ఆయనను 'మాస్ హీరో'గా నిలబెట్టిన సినిమా అడవి రాముడు.
కె.వి. మహదేవన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ చార్ట్‌బస్టర్. ఈ పాటలో ఎన్టీఆర్, జయప్రదల కెమిస్ట్రీ, రాఘవేంద్రరావు మేకింగ్ స్టైల్.. అంటే ఈ పాటలో పూలవర్షం కురిపించారు. ఇలాంటివి తెలుగు వెండితెరపై ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. అడవి లొకేషన్లలో చిత్రీకరణ, ఏనుగులతో ఫైట్లు, భారీ సెట్టింగ్‌లు ఆ కాలానికి చాలా వినూత్నంగా ఉండేవి.కమర్షియల్ అంశాలను ఎలా పండించాలో, హీరోయిన్లను అందంగా ఎలా చూపించాలో రాఘవేంద్రరావు ఈ సినిమాతో నిరూపించారు. అందుకే ఆయనను 'దర్శకేంద్రుడు' అని పిలుస్తారు. ఆరోజుల్లోనే బాక్సాఫీస్ బాహుబలిగా నిలిచింది.












Click it and Unblock the Notifications