రష్మిక పెళ్లికి రక్షిత్ శెట్టి?.. మాజీ ప్రేయసి పెళ్లి కార్డు అందిందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగనుండగా.. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శుభ సమయంలో రష్మిక పాత జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రమోద్ శెట్టి కామెంట్స్‌తో మొదలైన చర్చ
రష్మిక మందన్నా తన వివాహానికి మమ్మల్ని ఆహ్వానిస్తుందని తాను అనుకోవడం లేదని కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. రష్మిక కెరీర్ ప్రారంభంలో నటించిన 'కిర్రిక్ పార్టీ'లో ఆయన కీలక పాత్ర పోషించారు. రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ నటుడు రక్షిత్ శెట్టికి ప్రమోద్ అత్యంత ఆప్తమిత్రుడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్మిక తన పెళ్లికి రక్షిత్‌ను గానీ.. తనను గానీ పిలుస్తుందని ఆశించడం లేదని.. తాము కూడా ఈ ఆహ్వానం కోసం ఎదురుచూడటం లేదని కుండబద్దలు కొట్టారు.

రక్షిత్ శెట్టి గురించి క్లారిటీ
రష్మిక పెళ్లి గురించి రక్షిత్ శెట్టి ఏమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు కూడా ప్రమోద్ శెట్టి బదులిచ్చారు. రక్షిత్ ప్రస్తుతం తన సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడని.. ఆయన రష్మికను ఎప్పుడో మర్చిపోయారని వెల్లడించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే సమయం ఆయనకు లేదని.. తన కెరీర్ మీద మాత్రమే రక్షిత్ దృష్టి పెట్టినట్లు ప్రమోద్ శెట్టి తెలిపారు. ఈ కామెంట్స్ రష్మిక అభిమానులకు కొంచెం అసహనానికి గురిచేసినా.. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఇవి వైరల్ అవుతున్నాయి.
పీటల వరకు వచ్చి ఆగిన పెళ్లి
రష్మిక, రక్షిత్ శెట్టిల కథ అందరికీ తెలిసిందే. 'కిర్రిక్ పార్టీ' షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే అనూహ్య కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమకు దూరమై టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'గీత గోవిందం' సినిమా నుంచి విజయ్ దేవరకొండతో మొదలైన పరిచయం ప్రేమగా మారి.. ఇప్పుడు వివాహం వరకు దారితీసింది. పాత గొడవలు ఏవైనా, ప్రస్తుతం విజయ్-రష్మిక పెళ్లి హంగామా మాత్రం ఫుల్ జోష్‌లో సాగుతోంది.












Click it and Unblock the Notifications