35 ఏళ్లుగా భార్యకు దూరంగా.. అయినా నానా పటేకర్ విడాకులు ఎందుకు తీసుకోలేదంటే?
ప్రముఖ నటుడు నానా పటేకర్(75) గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వెండితెరపై తన అద్భుతమైన నటన, గంభీరమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాందించుకున్న నానా పటేకర్ వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉండేది. ఆయన మరణం తర్వాత.. తన భార్య నీలకంటి పటేకర్ నుంచి దాదాపు 35 ఏళ్ల పాటు విడిపోయి జీవించినప్పటికీ.. విడాకులు ఎందుకు తీసుకోలేదనే విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
నానా పటేకర్, నీలకంటి మొదటిసారిగా నాటక రంగంలో పనిచేస్తున్న రోజుల్లో కలుసుకున్నారు. కలిసి పనిచేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. వీరు 1978లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు దుర్వాస పటేకర్, మల్హర్ పటేకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నీలకంటి పటేకర్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే రచయిత్రిగా, నటిగా పనిచేసి జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.

అయితే వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో తీవ్ర దుఃఖం నిండిన క్షణాలు కూడా ఉన్నాయి. వారి పెద్ద కుమారుడు దుర్వాస పుట్టుకతోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. కేవలం రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూశారు. ఈ విషయం వారిద్దరినీ తీవ్రంగా కుంగదీసింది. చిన్నకుమారుడు మల్హర్ పటేకర్ తండ్రిలా కెమెరా ముందుకు రాకుండా.. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ది అటాక్స్ ఆఫ్ 26/11' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ కెమెరా వెనుక స్థిరపడ్డారు.
లీగల్ గా ఎప్పుడూ విడాకులు తీసుకోనప్పటికీ.. నానా పటేకర్, నీలకంటి పటేకర్ దాదాపు 35 ఏళ్లుగా వేర్వేరుగానే జీవిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ తమ వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ.. ఇద్దరి వ్యక్తీకరణలు ఆలోచనా విధానాలు, వ్యక్తిత్వాలు చాలా భిన్నంగా ఉండటం వల్ల ఒకే ఇంట్లో కలిసి జీవించడం కష్టంగా మారిందని తెలిపారు. అందుకే ఇద్దరి పరస్పర అంగీకారంతోనే వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నప్పటికీ.. నానా పటేకర్ నీలకంటి పట్ల ఎప్పుడూ ఎంతో గౌరవంగా ఉండేవారు. అందుకే విడాకుల ద్వారా తమ బంధానికి అధికారికంగా ముగింపు పలకాలని వారు ఎప్పుడూ అనుకోలేదు. సాధారణ సమాజ కోణంలో ఇది వింతగా అనిపించినప్పటికీ.. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటూ వేర్వేరుగా ఉండటమే తమ బంధానికి సరైన మార్గమని వారు భావించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంచిన నానా పటేకర్ మరణంతో ఆయన జీవితంలోని ఈ అపూర్వ బంధం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications
