చింతపట్ల క్విక్ బాక్సింగ్: ఈకకు ఈక
అదోహాలు. అదో పెద్ద హాలు. అదో పెద్దమనుషుల హాలు. పెద్ద మనుశషులందరూ పెద్దపెద్దగా అరిచే హాలు. అరిగీపెట్టేహాలు. అదో పెద్ద హాలు.
పెద్దహాలులో ఉన్న పెద్దమనుషులందరికీ వేరు వేరు జండాలున్నవి. వేరు వేరు అజెండాలున్నవి. వేరు వేరు పార్టీలకు చెందిన పెద్ద మనుషులు వేరువేరుగా తమ తమ సీట్లలో కూర్చుని వున్నారు. పెద్దహాలులో పెద్ద పెద్ద మనుషులు కూచున్నహాలులో వేరువేరు పార్టీలకు చెందిన పెద్ద మనుషుల్లో కొందరు అధికార పార్టీ సీట్లల్లో వుంటే మరికొందరు ప్రతిపక్షంలోని సీట్లల్లో వున్నారు. మాట్లాడ్డానికి మైకులున్నవి. విండానికి కర్ణాభరణాల్లా హియరింగుసెట్లున్నవి.
పెద్దమనుషులు ఆ హాలులో ప్రజల సంక్షేమం కోసం బడుగుజనుల బాగుకోసం పేదల అభ్యున్నతి కోసం ప్రజాస్వామ్యం తల ఎత్తుకుని నిలబడ్డం కోసం చర్చలు జరపడానికి పెద్దలు సిద్ధంగా వున్నారు. సంసిధ్దంగా వచ్చారు. సమావేశపు హాలులో సమావేశాలు మదలయినయి. ఇప్పుడిప్పుడే మైకులు గోంతు సవరించుకుంటున్నవి. తుపాను వచ్చేముందరి సముద్రతీరంలా పరిస్ధితి శాంతంగా ప్రశాంతంగా వుంది.
ఐదూపదీ ఇరవై నిమిషాలు అంతా సవ్యంగా నియమబద్ధంగా జరిగిపోయింది. పెద్దమనుషులంటే వీళ్లురాబాబూ పెద్దమనుషుల సభంటే ఇదేరా నాన్నా అనాలపించేట్టుంది. క్రమక్రమంగా సమావేశం క్రమం తప్పింది. మాటలు అరుపులుగా మారడానికి ఆట్టే సమయం పట్టలేదు. క్రమక్రమంగా తప్పిన క్రమం కట్టు కూడా తప్పింది. అరుపులుగా మారిన మాటలు కేకులుగా మారాయి. కేకులు గావుకేకలుయ్యేయి.
గావుకేకలు మొదలుపెట్టిన మనుషులు పెద్దతనం మరచిపోయేరు. పెద్దమనుషుల సమావేశం జరుగుతున్న పెద్దహాలు కూరగాయల మార్కెటయింది. జుయ్యమని ఈగలు ముసిరే మార్కెటయింది. వాళ్లు కొట్టుకొచ్చిన సెంటు వాసన కంపుగొట్టసాగింది. అరిచే వాళ్లు అరుస్తూనేవున్నారు.
కొందరు మొనగాళ్లు సభాపతి పోడియమ్‌లోకి దూసుకొచ్చారు. సైలెన్స్.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం సైలెన్స్ అన్న మాటలు ఎవరికీ వినిపించడం లేదు. ఎవరు ఏమి మాట్లాడ్తున్నదీ ఎవరెవరు ఏమికేకలు పెడ్తున్నదీ ఎవరకీ అర్ధం అవడం లేదు.
సరిగ్గా ఈ సమయంలో అసభలోకి రాగూడని ప్రాణి ఒకటి వచ్చివున్నది ఈ గడబిడకి హడలిపోయింది. అదిరిపడింది. ఏం చేయాలో తోచలేదు. ఉన్నట్టుండి ఒక్కఅరుపు అరిచింది. ఇప్పటిదాకా సభగోడలకే పైకప్పుకీ కొట్టుకుంటూ వెనక్కి వచ్చిపడుతున్నా ధ్వనులకి ఇది విరద్ధంగా వుండటంతో అంతా ఒక్కసారిగా 'స్టన్' అయిపోయారు. సైలెంటయిపోయారు. ఎవరేమం మాట్లాడితే మనకేంలే అని తమ తమ కొంపల్లోనే నిద్ర పోతున్నాయనీ ఇప్పడే తెల్లారిందని అందుకే కోడిపుంజు కొక్కొరోయని అరిచిందని భావించి ఉలిక్కిపడుతూ నిద్దర్లేచారు.

సభాపతి చేయలేని పనిని చేసి సభ్యులను స్టన్నునూ సైలెంటునూ సాధించిన ఆజీవికి యిక ఏంచేయాలో తోచలేదు. ఒక్కగెంతు గెంతి సభాపతి మందున్న బల్ల మీద కూచుంది వణుకుతూ డెంగ్యూజొరం వచ్చిందానిలా.
ఇటువంటి పరిస్ధితిని ఎన్నడూ చూసి వుండని సభాపతి జీవుల మీద కాస్త కారణ్యంవున్న వాడవడం చేత దాని వొంటిమీద అరచేయి వేసి పాముతూ ఎవరు నువ్వు! ఇది పెద్ద మనుషుల సభ! ఇది ప్రజల దగ్గర్నుంచి వసూలయిన డబ్బు ఖర్చు పెట్టి ఎంతో విలువయిన చర్చలు జరిగే చోటు. ఇక్కడికి పెద్దమనుషులు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లు తప్ప కోళ్లూ కుక్కులూ పందులూ రావడానికి వీల్లేదని తేలీదా? అన్నాడు సౌమ్యంగానే.
అప్పట్నించీ అందరూ 'అధ్యక్షా' అని సంభోదించడం వినివున్న ఆ కోడిపుంజు, నల్లగానిగనిగలాడే ఈకలూ, ఎర్రగా వంకులు తిరిగివున్న కిరీటమూ ధరించి వున్న పుంజుకోడి తను కూడా అధ్యక్షా అని సంభోదిస్తూ ఇలాగ చెప్పింది తనగోడు. అధ్యక్షా! ఇది పెద్దమనుషులు ప్రజాసేవ కోసం గొంతులు చించుకునే చోటని నాకు తేలీనేతెలీదు. ఒట్టు. నేను ఈ హాలు వెనుక వైపువున్న కాలనీలో మా యజమాని ముద్దుగా మురిపెంగా పెంచుకుంటున్న 'హే హెన్'ని. నేనుండే యింటికి ఎదురుగ్గా వుండే గేట్ లోపల ఓ నల్లటి కుక్క వున్నది. అదో ఇంగ్లీషు కుక్క. నేనో నాటు కోడిని.
అందువల్లనో ఏమో దానికి నేను క్షేమంగా వుండడం యిష్టంలేక నన్ను చూసే చూడగానే 'భౌభౌ' మని అరుస్తూవుంటుంది. ఆ ఇది మన్నేం చెయ్యగలదులే అంతలావుపాటి చైనుతో కట్టేసి వుంటుంది గదా అని దారి భౌభౌలని లైట్‌గా తీసుకునేదాన్ని. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా వుండదు కదా. అధికారం ప్రతిపక్షమయ్యి ప్రతి పక్షం అధికారంలోకి రావచ్చునుకదా. ఖర్మకాలితే తాడు పామై కరవొచ్చుకదా. ఈ వేళ దాని కట్టువూడదీశారో అదే వూడపీక్కుందో కానీ గింజ గింజ ఎంతో శ్రమపడి ఏరుకుతింటున్న నామీదకి వచ్చిపడింది నరకలోకపు జాగిలంలా.
'బ్రతుకు పుంజూడా' అంటూ ప్రాణాలు ఈకల్లో పెట్టుకుని ఒలపింక్సులో రన్నరులా రన్నింగు చేశా. ఎక్కడికి వెళ్తున్నదీ తెలీలేదు. ఇక్కడికి ఎట్లా వచ్చిందీ గుర్తులేదు. పరుగెత్తి అలసిసొలసి వోమూల సొక్కిసోయి లేకుండా పడుకున్న నన్ను మీ పెద్ద మనుషులు అరుపలు నిద్దర్లేపేయి. నేను నిద్దర్లేపాల్సిన వాళ్లు నన్ను నిద్దర్లేపారు. అధ్యక్షా యివాళ నా అదృష్టం బాగుంటం వల్ల నా పెట్టుకు పసుపుకుంకాలు నిండకపోవడం వల్లా యిట్లా బ్రతికుండి టేబిల్ ఎక్కుగలిగాను అన్నిది' కోడిపుంజు
'చోద్యం చూస్తూ వింటూ పెద్ద మనుషులు ఆశ్చర్యం నుంచి తేరుకున్నారు. ఆట్టే సేపిక్కడ నించుని మా విలువైన టైం వృధా చేయకు తిన్నగా ముక్కుసూటిగా నడిచివెళ్లిపో బయటకు' అన్నాడు సభాపతి
హమ్మయ్య బ్రతికాంరా అనుకున్న కోడి ఆ బల్లమీదనించి గెంతుతుంటే సభ్యులు మళ్లీ అరుపులు లంకించుకున్నారు. బెదిరిపోయింది కోడిపుంజు. ప్రతిపక్షాల వాళ్లున్న సీట్ల మధ్యకు దూకింది. వాళ్ళు దాని మానాన దాన్నిపోనీలేదు క్కొక్కొక్కొ అంటూ దాన్ని పట్టుకోడానికి ఎగబడ్డారుకొందరు. మరికొందరు మైకులందుకుని 'సభాధ్యక్షా యిది అధికారపార్టీ యొక్క కుట్ర కుతంత్రం అనరిచారు. సభలో వాళ్లని ముప్పతిప్పలు పెట్టి మూడు చెర్వుల నీరు తాగించకుండా ఈ కోడిపుంజును అడ్డుపెట్టుకున్నారు అనరిచారు. ప్రాణ భయంతో పరుగులు తీసిన పుంజు ఓ బడానాయకుడి బట్టతల మీద తప్పని పరిస్ధితిలో పెట్టవేయనే వేసింది'
ఇంకేముంది సభద్దరిల్లి పోయింది. మోసం.. దగా.. అవమానం.. ఎన్నడూ లేంది ఒక కోడిపుంజు సభలోని రావడం సభా సంప్రదాయాలకు విరుధ్దం రూల్సుకి వ్యతిరేకం అని కొందరు గొతులు చించుకున్నారు. పోలీసులేం చేస్తున్నారు. చైను దొంగల్ని ఏటీఎమ్ దొంగల్ని ఎట్లాగూ పట్టుకోలేరు. కనీసం కోడిపుంజునయినా పట్టుకోలేరా అని మరికొందరు గాయిపెట్టారు.
సందట్లో సడేమియా అన్నట్టు ఓ సభ్యుడు ఈ కోడిపుంజును ఫలానా మంత్రిగారింట్లో చూశానని ఆయనే దాన్ని బుట్టలో పట్టుకొచ్చి సభలో వొదిలివుంటాడని ఆరోపించాడు. మరొకడు బుూతుదండకం చదివాడు. ఒక సభ్యుడు ఆ ఫలానా మంత్రి రాజీనామా చేసి తీరాలన్నాడు. మరొక సభ్యుడు ప్రభుత్వమే రాజీనామా చేయాలన్నాడు. ఒకాయన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పితీరాలన్నాడు. ఇలాగిలాగ ఈ పెద్దమనుషులు ఒకళ్లనొకళ్లు నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ వున్న సమయంలో కోడి పుంజు బయటకు వెళ్లలేక అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య బంతిలా ఎగరెగిరిపడింది.
పుంజు చేతికి చిక్కిన వాళ్లు దాని నల్లటి ఈకలు పీకసాగారు. అది ఈవైపు దూకినప్పుడు ఇటు పెద్దమనుషులు అది ఆ వైపు దూకినప్పుడు అటు పెద్దమనుషులు అదే పనిగా దాని ఈకలు పీకేశారు. పెద్దమనుషులు పెద్దహాలులో సమావేశమయిన పెద్ద మనుషులు ప్రజలకొరకు మాట్లాడ్డం కాకుండా నా ఒంటి ఈకలు పీకుతూ ప్రజాధనం వ్యర్ధం చేస్తున్నారే అంటూ ఏడ్చింది కోడిపుంజు.
సభముగిసే సమయానికి ఎవరో గిరగిరాతిప్పి విసిరేస్తే మళ్లీ వచ్చిపడ్డది సభాపతి ముందున్న బల్లమీదకి. అప్పటికిదాని ఈకలన్నీ పోయి తోలుతిత్తిలా మిగిలిపోయింది. 'ప్రజాస్వామ్యం జిందాబాద్' అంటూ కోడి మెడ వాల్చేసింది.
కోడిగుడ్డు ఈకలు పీకేవాళ్లు కోడిపుంజుని వదుల్తారా అనుకుంటూ సభను వాయిదా వేశాడు సభాపతి.
- చింతపట్ల సుదర్శన్
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications