• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీ తీరే వేరు

By Staff
|

Mahendra Singh Dhoni
సీనియర్లకు ఒక్కరొక్కరికే పొగ పెట్టి యంగ్ ఇండియా ప్రపంచ క్రికెట్లో ముందుకు దూసుకుపోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్ జట్టు తీరే మారిపోయింది. విజయాల బాటన నడుస్తోంది. జట్టు ఆట తీరు ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడి లేదని ధోనీ రుజువు చేస్తున్నాడు. ఒక్కరు ఆడకపోతే మరొక్కరు ఆడుతారనే నమ్మకాన్ని క్రికెట్ జట్టు కూడగట్టుకుంది. శ్రీలంకతో తాజాగా జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ ఫలితమే ఇందుకు తాజా ఉదాహరణ. ఓటమి అంచున ఉన్న భారత్ ను పఠాన్ సోదరులు విజయ తీరం చేర్చారు.

ఇదిలా వుంటే, శ్రీలంక పర్యటనలో సచిన్ టెండూల్కర్ చాలా నిరాశ పరిచాడు. అతని పాలిట అంపైర్లు యముల్లా మారిపోయారు. ఎల్బీడబ్ల్యుల అవుట్ తో టెండూల్కర్ ను ఆడకుండా చేసేశారు. నిజానికి ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. నిజానికి, అతను అవుట్ కాకున్నా అవుట్ ఇచ్చారు. శ్రీలంకతో టెస్టు, వన్డే మ్యాచులు ముగిశాక చాలా నిరాశజనకమైన స్థితిలో టెండూల్కర్ భారత్ చేరుకున్నాడు. అతను మనస్థాపానికి గురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ తర్వాత సీనియర్లలో మిగిలి ఉంది టెండూల్కరే. ఇక అతని శకం కూడా ముగిసినట్లే అనిపిస్తోంది.

కాగా, ధోనీ అందిస్తున్న విజయాలు అతన్ని తిరుగులేని కెప్టెనుగా నిలబెట్టే పరిస్థితిని కల్పించాయి. గతంలో విఫలమైన ఆటగాళ్లు కూడా ఈ రోజు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరిలో చెప్పుకోదగింది వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లను. వీరిద్దరు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుండడం గమనించదగ్గ విషయం. వీరిద్దరూ పరుగుల వరదను పారించడంలో సఫలమవుతున్నారు. సెహ్వాగ్ అందిస్తున్న ఓపెనింగ్ జట్టు విజయంలో కీలకంగా మారిపోయింది. అలాగే, గౌతం గంభీర్ నిలకడైన బ్యాట్స్ మన్ గానే కాకుండా వేగంగా పరుగులు తీసే ఆటగాడినా, నమ్మకమైన బ్యాట్స్ మన్ గా రూపుదిద్దుకున్నాడు. సెహ్వాగ్, గంభీర్ లో ఓపెనింగ్ కు తిరుగు లేకుండా పోయింది. ఈ జోడీ విజయమే సచిన్ పాలిట శాపంగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో భారత్ క్రికెట్ లో ముంబై ఆధిపత్యానికి కూడా గండి పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఆధిపత్యం పెరుగుతోందా. ఇప్పుడే చెప్పలేం.

ఇకపోతే, శ్రీలంక సిరీస్ లో ధోనీ జట్టులోని ప్రస్తుత సీనియర్లు యువరాజ్, సెహ్వాగ్ లకు చెప్పకుండా ఒక సూచన చేశాడు. వీరిద్దరు ఫెయిలైనా సరే, జట్టు విజయం సాధిస్తుందని తెలియజేశాడు. అలాగే, పార్ట్ టైం బౌలర్లు అవసరమైతే యువరాజ్, సెహ్వాగ్ లు మాత్రమే లేరని, జట్టులో ఇంకా కొంత మంది ఉన్నారని హెచ్చరికలాంటిది ఆచరణలో చూపాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మలతో బౌలింగ్ చేయించడమే అందుకు నిదర్శనం. అలాగే, యూసుఫ్ పఠాన్ వంటి అసాధారణ క్రికెటర్ జట్టులోకి రావడం ప్లస్ పాయింటుగా మారిపోయింది.

మొత్తం మీద, ధోనీ భారత క్రికెట్ జట్టును ఒక మలుపు తిప్పాడు. భారత్ కు విజయాలు మాత్రమే ఉంటాయనే నమ్మకాన్ని కలిగించాడు. ఇతర జట్లను అతను సంక్షోభంలోకి నెట్టాడు. ఇంగ్లాండు, ఆస్ట్రేలియా జట్లను సంక్షోభంలోకి నెట్టింది ధోనీయే అని చెప్పవచ్చు. తాజాగా శ్రీలంక జట్టుకు కూడా ఆ పరిస్థితి కల్పించాడు. భారత క్రికెట్ లో ఇప్పుడు ధోనీ శకం నడుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X