ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోపుడు బండి సాదిక్: అతనో కల కంటున్నాడు

|
Google Oneindia TeluguNews

తోపుడు బండి, పుస్తకాలూ, 1000 కిలోమీటర్లూ వంద రోజుల్లో ప్రతీ గ్రామాన్నీ సందర్శిస్తూ వెళ్ళాలి... కాలినడకన ప్రయాణం 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ సాధ్యమా...? సాధిక్ అలీ కి తనకి తాను ప్రశ్నించుకోవటం ఇష్టం, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటం అంతకన్నా ఇష్టం... 1000 కిలోమీటర్ల యాత్ర సాధ్యమా అన్న ప్రశకి సమాధానం కోసం బయలేరిన అతను చివరికి వరంగల్ నడిబొడ్డున నిలబడి సమాధానాన్ని పట్టుకున్నాడు... సాధ్యమే...! అరిచాడు.., దిక్కులు పగిలి పోయేలా.... అరిచాడు "ఔనూ..! సాధ్యమే... మనిషన్న వాడు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే.." హైదరాబాద్ ఉప్పల్ నుంచీ రంగా రెడ్డి, మెదక్,నల్గొండ జిల్లాలమీదుగా ఒక్కొక్క ఊరిలో అక్షరాలు చల్లుకుంటూ, పుస్తకాలు మొలిపించుకుంటూ... నడిచాడు అతని సమాధానం కోసం సాగిన యాత్ర కొన్ని వందల ప్రశ్నలకు సమాధానాలనిచ్చింది....

టాక్ ఆఫ్ ద టౌన్: కవిత్వం తోపుడుబండి (పిక్చర్స్)టాక్ ఆఫ్ ద టౌన్: కవిత్వం తోపుడుబండి (పిక్చర్స్)

ఇప్పుడతనొక కల కంటున్నాడు 100 ఊర్లూ,100 గ్రంథాలయాలు... మళ్ళీ ప్రశ్న "సాధ్యమా..?" ఇప్పుడు సమాధానం అతను చెప్పడు... సాధిక్ అనే ఒక అత్యంత మామూలు వ్యక్తిని చూసిన ప్రతీ ఒక్కరికీ ఆ ప్రశ్నకు సమాధానం తెలుసు....

నాకూ ప్రశ్నలున్నాయి వాటికి సమాధానాలు సాధిక్ అలీ దగ్గరున్నాయి అడగటం నాకిష్టమైతే చెప్పటం ఆయనకూ ఇష్టం.... సరే..! కాల్ చేసాను.

 My identiti is Push cart: Sadiq Ali claims

"అన్నా...! మీతో కొంచం మాట్లాడాలి"

ఎందుకూ ఏమిటీ అని అడగలేదు "ఎక్కడ కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం?"

"గోల్డెన్ త్రెషోల్డ్..!?"

"సరే పదినిమిషాల్లో ఉంటా".....

సరిగ్గా 30 నిమిషాల తర్వాత... గోల్డెన్ త్రెషొల్డ్ దగ్గర.... నాకోసం 20 నిమిషాలుగా ఎదుర్చూస్తూ కూచున్నాడు.. నా సామాన్యుడు.., ఆ అసామాన్యుడు...

"చెప్పు ఏమిటి సంగతులు? భుజమ్మీద చెయ్యేసి అడిగాడు"

"వన్ ఇండియా కోసం ఒక ఇంటర్వ్యూ కావాలి అందుకే అన్నా"

"ఇంటర్వ్యూనా నా ఇంటర్వ్యూ ఏం చేస్కుంటావ్..? నేనేమన్నా...సినిమా స్టార్ నా, పొలిటీషియన్నా...లేదు వద్దు..?"
గంట పైగా పట్టింది ఒప్పించటానికి.... "సరే ఏం కావాలో అడుగు" అంటూ సిగరెట్ వెలిగించుకొని నాకూ ఒకటి ఆఫర్ చేసి. బుద్దిగా కూచున్నాడు... ఇక నేనడిగానూ...ఆయన చెప్పాడు.... ఆ ప్రశ్నలూ,వాటిసమాధానాలూ....

 My identiti is Push cart: Sadiq Ali claims

*మీ బాల్యం గురించీ....

కల్లూరు...ఖమ్మం జిల్లాలోని చిన్న టౌన్ అక్కడే పుట్టాను... నాన్న...,అమ్మ... అమ్మ చూపించిన ప్రేమ, నాన చెప్పిన రామాయణం,మహాభారతం, ఖురాన్.... అంతే ఇంకా ఏం లేదు చెప్పటానికి...

*అదేమిటి..!? బాల్యం అంటే అంతేనా...?

(చిన్నగా నవ్వుతూ... చూసాడు) ఇంకేముంటుంది...ఆటలూ... పాటలూ, అందరికీ ఉండేవే కొత్తగా ఎవరి బాల్యం గురించైనా ఏం చెప్తాం... నా జీవితానికి కావల్సిందేమిటో అప్పుడే అమ్మా..నాన్నా నాకు సమృద్దిగా ఇచ్చారు...ప్రేమా ని ఇచ్చిన అమ్మా...,నావ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే కథలను, పురాణాలనూ,ఖురాన్ నూ చెప్పిన నాన్న నాబాల్యం అంటే అమ్మా...నాన్న అంతే..

నాగ సాధువులు: నానో టెక్నాలజీనాగ సాధువులు: నానో టెక్నాలజీ

*సాహిత్యం అంటే ఇష్టం ఎప్పటినుంచీ మొదలయ్యిందీ...?

పదో తరగతి వరకూ కల్లూరులోనే చదువుకున్నాను.., మా తెలుగు మాస్టారు వైవీ. శర్మ గారని ఉండేవారు. ఆయన పధ్యాలు చదివితే అలా వింటూ ఉండిపోవాలనిపించేది. ఒక రకంగా నన్ను తెలుగు వైపు ఎక్కువగా ఆకర్శించింది ఆయనే... ఇంటర్ కి వచ్చేసరికి పురాణాలూ,ఉపనిషత్తులూ చదివేసాను...పధ్యాలూ ఆయన దగ్గరే నేర్చుకునే వాన్ని.

 My identiti is Push cart: Sadiq Ali claims

*మరి ఏం రాయలేదా..?

(హ..హ) రాసే శక్తి నాకు లేదనే అనుకుంటాను...చెప్పాకదా...! చదవటం ఇంకా పూర్తి కాలేదు చదువుతూనే ఉండటం..ప్రతీ దానినుంచీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటమే నాకిష్టం..

*పాత్రికేయ వృత్తిలో కొన్నాళ్ళు ఉన్నారు కదా...

హ..! నా MA అవుతూండగానే ఉదయం లో చేరాను.. వృత్తిలో భాగం కాక పోయినా అప్పుడప్పుడూ ఉదయం సండే స్పెషల్ అనుబందం లోనూ, శివరంజని అనే పత్రిక లోనూ కొన్ని రాసాను. రిపోర్టింగ్ కాకుండా నేను రాసిన సాహిత్యం అక్కడితో ఆగిపోయింది.

*ఈ యాత్రల సంగతేమిటీ?? ఎప్పుడూ ఎక్కడో ఒక చోట నిలబడకుండా తిరుగుతూనే ఉంటారు కదా... ఎందుకలా... ?

*నిజం చెప్పనా నాకు తెలిసి నేను అంటూ ఎవరూ లేరు...ఈ కనిపించే.., ఇక్కడ మీరు చూసే నేను...ఈ సాధిక్ అలీ నిజమైన నేను కాదు..నేనంటూ వేరే ఉన్నాను. ఆ "వేరే" నన్ను, నేను ఈ విశ్వం లో వెతుక్కుంటాను.. ఆ వెతుకులాటే నా ప్రయాణాలు. కొన్ని సార్లు భగవత్ గీత లోనూ, పురాణాల్లోనూ చెప్ప బడ్డ ప్రదేశాల్లో నేను తిరుగుతున్నట్టు కలలు వచ్చేవి. అంతే మెలకువ రాగానే ప్రయాణం మొదలయ్యేది అలా.. సోమనాథ్,కురుక్షేత్రం ఇలా 12శతాబ్తం కంటే ముందు నిర్మించబడ్డ ఆలయాల్లో ఆ గాథల ఆనవాల్లు వెతుక్కుంటూ తిరిగాను..ఇప్పటికి దేశం మొత్తం 3సార్లు తిరిగాను.. ఎక్కువ శాతం కాలినడకనే.

*మీకున్న శతృవులూ మిత్రుల గురించి చెప్పగలరా.... అభ్యంతరం లేకుంటేనే..

శతృవు ఒకరున్నారు...,మిత్రుడూ ఒకరున్నారు ఆ ఇద్దరి పేర్లూ షేక్ "సాధిక్ అలి..షేక్ సాధిక్ అలి" ప్రపంచం లో నాకెవరూ శత్రువులు లేరు... ఎందుకంటేమంచి మనిషీ చెడ్డ మనిషీ అని రెండురకాల మనుషులుండరు. మనం చూసే పద్దతుల్లో మనకు నచ్చని,నచ్చే వ్యక్తులుంటారు..తేడా ఇక్కడ ఉంది (తలని చూపిస్తూ).. ఒక మనిషిని చెడ్డ వాడు గా చూస్తున్నానూ అంటే నాలో ఎక్కడో తేడా ఉంది అంటే నాశతృవు నేనే..

 My identiti is Push cart: Sadiq Ali claims

(ఆ తర్వాత దగ్గర్లో ఉన్న టీస్టాల్ వైపు నడిచాం)

*సరే ఈ "తోపుడుబండి" ఆలోచన ఎప్పటిది? ఎలా మొదలయ్యింది...?

ఈ ఆలోచన ఇప్పటిది కాదు 35 ఏళ్ళ కింద ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకం పేరూ,రచయిత పేరూ రెండూ గుర్తు లేవు కానీ అందులో ఉన్న ఒక పేరా నన్ను విపరీతంగా ఆకర్షించింది. అన్దులో హీరో ఒక కల కంటాడు... తోపుడు బండిలో పుస్తకాలు అమ్ముతున్నట్టు.. మెలకువ వచ్చాక సాహిత్యానికి ఎప్పటికైనా ఆ దశ వస్తుందా అనుకొని నిట్టూరుస్తాడు... ఆ లైన్లు నన్ను కట్టి పడేసాయి..ఆ కల నాకూ రావటం మొదలయ్యింది. 2015 విజయ వాడ బుక్ ఫెయిర్ నుంచి తిరిగి వస్తూ నేనూ "వాసిరెడ్డి పబ్లికేషన్స్" వాసిరెడ్డి వేణుగోపాల్ గారూ సూర్యా పేట దాబా దగ్గర ఆగాం.. అక్కడ మళ్ళీ ఈ ఆలోచన ని అమల్లో పెట్టటం గురించి ఆలోచించాం... హైదరాబాద్ వచ్చాక అరవింద్ కుమాక్ కొల్లి కూడా మాతో జతకలిసాడు. కలిసి పని చేసాం ఫలితం ఏమిటో 2015 ఫిబ్రవరి 22 న నువ్వే చూసావ్ కదా (ఆ రోజే తోపుడు బండి మొదలు పెట్టారు)

*మరి ఈ 1000 కిలోమీటర్లూ 100 రోజులూ ఏమిటి..? మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక్కరే అనుకున్నారా లేదంటే ఎవరైనా సపోర్ట్ కి వస్తారు అనుకున్నారా?

*నా నమ్మకం నేనూ..నాతో ఉన్న భానోజీ రావూ అంతే ఈ ఇద్దరమే... కోరిక నాది..,సంకల్పం నాది మరి నేనే కదా చేయాల్సిందీ.. అందుకే ఎవరినీ ఆహ్వానించలేదు.. నేను మొదలయ్యాక కోంపల్లి వెంకట్ గౌడ్,.నకుల్,షారూఖ్ ఇలా వీళ్ళంతా నామీద ప్రేమతో వచ్చి కలిసారు. నిజానికి నేను అనుకున్నది కవులూ,రచయితలూ పెద్ద ఎత్తున వస్తారని... కానీ మూడునెలల్లో వచ్చిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు..అయితే వాళ్ళంతా ముగుంపు సభరోజు వచ్చారు... నేను నిజం చేసిన వాళ్ళ కలని చూసి హత్తుకున్నారు.. ఎవరూ రాలేదన్న బెంగ లోపల ఏమాత్రమో మిగిలి ఉన్నా అది ఆ రోజుతో తీరిపోయింది...

*మరి ఈ వంద గ్రంథాలయాల ఏర్పాటు సంగతేంటి??

ఔను...! పుస్తకాలు చవాలీ అంటే ముందు పుస్తకాలు దొరకాలి కదా... మీకు తెలుసా పల్లెటూళ్ల లో పిల్లలు చదవక కాదు చదవటానికి లేక..పుస్తకాలు దొరక్క చదువుకు దూరమౌతున్నారు. చదువూ అంటే కేవలం క్లాస్ పుస్తకాలు కాదు కదా. చిన్న చిన్న పనులు చేసుకునే ఆ తల్లితండ్రులు వీళ్ళ స్కూలు పుస్తకాలు కొనటానికే నా నా అవస్తలూ పడుతున్నారు ఇక సాహిత్య పుస్తకాల మాట వారి ఆలోచనకే రాదు. అందుకే ఊరూరికీ ఒక గ్రంథాలయం ఉండాలనేది... ఇప్పుదు నా లక్ష్యం అదే ఖచ్చితంగా 100 గ్రంథాలయలని స్థాపించి తీరతాం... ఆ తర్వాత కూడా చేస్తూనే ఉంటాను... ఈ విశయం లో ఇప్పటికే చాలామంది నాతో చేరటానికీ,తమవంతు సాయమందించటానికీ వస్తున్నారు. వాళ్ళంతా కలిస్తే ఇది పెద్ద కష్టమేం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతీ ఊరికీ ఒక లైబ్రరీ ఉండేదాకా ఇది కొనసాగుతుంది.

 My identiti is Push cart: Sadiq Ali claims

*దీనికీ ఏదైనా ప్రేరణ ఉందా... అదే తోపుడు బండికి పుస్తకం లో భాగం ప్రేరణ అయినట్టు

ఉంది..! నా మిత్రుడు యాకుబ్ వాళ్ళ ఊరు రొట్టమాకు రేవు లో గ్రంథాలయం ఏర్పాటు చేయటం..,దానికి నన్నూ ఆహ్వానించటం...అక్కడికి వెళ్ళాక ప్రతీ ఊరిలోనూ ఇలా ఒక గ్రంథాలయం ఉంటే బాగుంటుంది కదా అనే అలోచన వచ్చింది.. అదే అమల్లొ పెట్టాను.

*మరో గ్రంథాలయ ఉద్యమం లాగానా..?

కాదు ఇది ఉధ్యమం కాదు ఇది నిర్మాణాత్మక భాద్యత అంటాను. తెలంగాణా లో ఉన్న పల్లెలు..,అక్కడి పిల్లలూ పుస్తకాలకు దగ్గరవ్వాలి. సాహిత్యం పల్లె పల్లెకూ పాకాలి...అప్పుడు ఖచ్చితంగా అక్షరాస్యతా శాతం పెరుగుతుంది... పిల్లలూ కేవలం టెక్స్ బుక్ దగ్గరే ఆగిపోరు... వారి బుద్ది మరింత విస్తరిస్తుంది...

*సరే మళ్ళీ మీదగ్గరికే వస్తే హిమాలయ యాత్ర.... ఒక్కరే వెళ్ళి తిరిగి వచ్చారు కదా అసలు సాధిక్ అలీ అనే పేరూ కాషాయ వస్త్ర ధారణా రెండూ కాస్త వింతగా అనిపించాయి కొందరికి... మీకు హిమాలయా యాత్ర చేయాలని ఎందుకనిపించింది?

(సిగరెట్ పఫ్ లాగి కొద్ది సేపలా శూన్యం లోకి చూస్తూ ఉండిపోయాడు, ఒక నిమిషం పాటు ఆగి)

చెప్పాను కదా..! చిన్నప్పటినుంచీ నాన్న అన్ని పురాణాలనీ, ఖురాన్ నీ ఏక కాలం లో నేర్పించాడు, కల్లూరు మిషనరీ స్కూల్ లో చదువుకున్నప్పుడు బైబిల్ చదివేవాన్ని ఇప్పటికీ కొన్ని కీర్తనలు నాకు కంఠతా వచ్చు. ఇలా అన్నీ చదివినప్పుడే నాకొవిశయం అర్థమయ్యిందీ అన్నిటిలోనూ ఉన్న విశయం ఒకటే... ప్రాంతాలను బట్టి ఆరాధనా పద్దతులూ,ఆచార వ్యవహారాల్లొ తేడా వచ్చింది. ఏ మతం లో పద్దతులని ఆచరించినా మనం ఒకే దేవున్ని ఆరాధిస్తున్నాం.

ఇక నేను భారతీయున్ని ఈ ప్రాంతం లో ఉన్న పద్దతుల్లో నేను నమ్మిన దేవున్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాను... నేను జన్మతహ ముస్లిం నే కాదు భారతీయున్ని కూడా.. అల్లాని చేరుకోవటానికి నేను ఇంకొక పద్దతిలో ప్రయత్నిస్తున్నా... నాకు దేవుడే ఒక మతం మరే ఇతర మతాలతోనూ నాకు సంబందం లేదు... నేను హిమాలయాలకు వెళ్ళినా, ఆ దారిలో నాలో ఉన్న అహాన్ని చంపుకోవటానికి బిక్షాటన చేసినా, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన తిరిగినా అన్నిటికీ ఒకటే కారణం... నాలో ఉన్న భగవంతున్ని నేను కనుక్కోవాలి....

*ప్రతీ మగాడి విజయం వెనకా ఉండే స్త్రీ... సాధిక్ అలి వెక కూడా ఉండే ఉంటుంది కదా ఆవిడ గురించి....

ఒకరు కాదు ఇద్దరు స్త్రీలున్నారు... అమ్మ బద్రున్నిసా బేగం (బద్రున్నిసా అంటే పున్నమి వెన్నెల అట ఆయనే చెప్పారు) తర్వాత నాకు అమ్మైనా,భార్య అయినా, కూతురైనా అన్నీ..అన్నీ నాభార్య ఉష... ఒక రకంగా ఆమె లేకుంటే నేను ఏమైపోయేవాన్నో తెలీదు. నిజానికి తాను లేకుంటే నేనూ లేను...

(నెమ్మదిగా అబీడ్స్ రోడ్డు మీదికి చేరుకున్నాం.... ఫుట్ పాత్ పుస్తకాల షాపులని చూస్తూ నడుస్తున్నాం...)

*ఇదే ఇక ఆఖరి ప్రశ్న...(ప్రస్తుతానికి) షేక్ సాధిక్ అలీ అనే ఒక వ్యకి ని మీరేమని నిర్వచిస్తారు?

శూన్యం లోనుంచి శూన్యం లోకి వెళ్ళే ఒక మనిషిని గురించి నేనేం చెప్పగలను... చెప్పాల్సి వస్తే రెండు మాటలు మాత్రం చెప్తాను.. సాధిక్ అలీ "ఒక నిమిత్త మాత్రుడు"... అతని అస్తిత్వం "తోపుడు బండి" ఇంతే....

అబీడ్స్ రోడ్డూ....పాతాకొత్తా పుస్తకాలూ...చుట్టూ పరుగులు పెడుతున్న మనుషులూ,వాహనాలూ అన్నీ ఒక్క క్షణం కాస్త మసగ్గా కనిపించాయి అక్కడే నిలబడ్డాను... అతను మాత్రం పుస్తకాలని చూస్తూ నడుస్తున్నాడు.... ఇప్పుడతను ఏం ఆలొచిస్తున్నాడో ఖచ్చితంగా చెప్పగలను... నిజానికి అతను ఆలోచించటం లేదు...నడుస్తూనే ఒక కల కంటున్నాడు... ఆ కలలో ప్రతీ ఊరిలోనూ ఒక గ్రంథాలయం, దాని లోపల అరల్లో పుస్త కాలు వందల కొద్దీ వేలకొద్దీ...పుస్తకాలు..,సీతాకోక చిలుకల్లా ఆ గ్రంథాలయం లో చదువుకుంటున్నపిల్లలు... అదీ అతని కల... మరి ఆ కల నిజమవుతుందా..? అంటే... సమాధానం మీకు తెలుసుకదా...

English summary
A former journalist Sadiq Ali created innovative idea to make awarness of reading books and establish libraries in rural area. with push cart with books a travelled 1000 km in rural areas of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X