వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ - భారత స్కామ్ రాజధాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
భారత ఐటికి అనువైన కేంద్రంగా హైదరాబాద్ రూపు దిద్దుకుంటుందని చెప్తారు. అయితే అదే హైదరాబాద్ భారత కుంభకోణాల రాజధానిగా అపకీర్తిని కూడా మూటగట్టుకుంటున్నది. ఇటీవలి కాలంలో పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. కృషి బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, వాసవి, ప్రుడెన్షియల్, గ్లోబల్ ట్రస్టు బ్యాంకుల కేసులు, నాగార్జున ఫైనాన్స్ కేసు కుంభకోణాలు హైదరబాద్ పై మాయని మచ్చలే. ఇక సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదుకు తెచ్చిన మచ్చ ఎన్నటికీ మాయనిది. దేశంలో అతి పెద్ద వైట్ కాలర్ నేరంగా దీన్ని చెప్తున్నారు. తాను 7 వేల కోట్లకు పైబడి అక్రమాలకు పాల్పడినట్లు రామలింగరాజు స్వయంగా అంగీకరించాడు.

నిజానికి సత్యం కుంభకోణంలో ఇన్వెస్టర్లకు జరిగిన నష్టం 14 వేల కోట్ల రూపాయల మేరకు ఉంటుందని మీడియా, ప్రభుత్వ, సిబిఐ లెక్కల ప్రకారం తెలుస్తున్నది.

ఈ కుంభకోణాలకు పాల్పడినవారందరూ వాస్తవరంగా హైదరాబాదీలు కారు. అయినప్పటికీ రాజకీయ పెద్దలతో కుమ్మక్కయి వ్యాపారం పేర, ఇతర పెట్టుబడుల పేర సామాన్య ప్రజలను మోసం చేశారు. తద్వారా హైదరాబాద్ కు అపకీర్తి తెచ్చి పెట్టారు. ఆ కుంభకోణాలను అన్నింటినీ మీడియా హైదరాబాదుకు అంటగడుతున్నది. తద్వారా బ్రాండ్ హైదరాబాద్ కు నష్టం కలగడం లేదా. దీనికి సమాధానం ఉందా.

ప్రత్యేక తెలంగాణ అవసరానికి గల కారణాలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. కొన్నింటిని చూద్దాం. తెలంగాణ 1956కు ముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. గత 53 ఏళ్లుగా ఆంద్ర, రాయలసీమ రాజకీయ నాయకత్వాలు తెలంగాణపై ఆధిపత్యం వహిస్తూ ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచారు, ధ్వంసం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని, స్వయం పాలనను, అభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలుగు భాష ఒక్కటే అయినా తెలంగాణ ప్రజల మాండలికం వేరు, అంతేకాకుండా సాంస్కృతిక భిన్నత్వం కూడా ఉంది.

భారత దేశంలోని 18 (అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, మిజోరం, పంజాబ్, గోవా, చత్తీస్ ఘడ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, కేరళ) రాష్ట్రాల కన్నా తెలంగాణ పెద్దది. అరవై దేశాల కన్నా పెద్దది.

విద్య, ఉపాధి, వనరులు, ఆర్థికం, సౌకర్యాల వంటి అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలకు న్యాయమైన వాటా దక్కలేదు కాబట్టి గత ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు దేశం నుంచి విడిపోవాలని కోరుకోవడం లేదు. పాత హైదరాబాద్ రాష్టాన్ని పునరుద్ధరించాలని మాత్రమే కోరుకుంటున్నారు.

తెలంగాణ ప్రజలు, నాయకులు తమ ప్రాంతంలోని ఖనిజ సంపదను, సహజ వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చుకుని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి స్వయం పాలనను కోరుతున్నారు. తెలంగాణలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. గత హైదరాబాద్ రాష్ట్రంలో 40 శాతం మంది ముస్లింలకు ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు రెండు, మూడు శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వల్ల స్వయం పాలన, ఆత్మగౌరవం ఒనగూరడమే కాకుండా విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి.

లోకసభలో, శాసనసభలో ఇచ్చిన, చేసిన, కుదుర్చుకున్న హామీలు, ఒప్పందాలు, ఫార్మూలాలు, ప్రణాళికలు ఏవీ గత 53 ఏళ్లలో అమలు కాలేదనేది సత్యం. తెలంగాణ వివక్షకు, వెనకబాటుకు, దోపిడీకి గత 53 ఏళ్లుగా గురవుతూనే ఉన్నది. దానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం.

తెలంగాణ బలహీనవర్గాలు, మైనారిటీలు, మహిళల గొంతులను వినేవారు సమైక్య రాష్ట్రంలో లేకుండా పోయారు. తెలంగాణ ప్రజలు 50 ఏళ్లు సహనంతో నిరీక్షించారు. గత యాభై ఏళ్లుగా వివక్ష పెరిగిందే తప్ప తగ్గలేదు. భవిష్యత్తు తరాలవారు ఇదే విధంగా బాధపడే పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం తెలంగాణ ప్రజలపై ఉంది.

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం
కాంగ్రెసు పార్టీకి చెందిన 41 మంది తెలంగాణ శాసనసభ్యులు 2000 సెప్టెంబర్ లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి ముందు తమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావును, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఒప్పించారు.

2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం గత రెండు నెలలుగా మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, డాక్టర్లు, విద్యార్థులు, ఎన్నారైలు, మహిళలు, పిల్లలు తమ గొంతు పెంచారు.

నవంబర్ 29వ తేదీన తెరాస అద్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దాంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, మేధావులు, మేధావులు, మహిళలు, పిల్లలు వీధులకెక్కారు.

తెలంగాణ రాష్ట్రం ఇస్తామని 2004లో కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రసంగంలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ హామీ ఇచ్చారు. యుపిఎ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ ఇవ్వగలుగుతుందని 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెసు హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని రాష్ట్రంలోని కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలతో సహా అన్ని రాష్ట్ర పార్టీలు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెడితే బలపరుస్తామని 2009 డిసెంబర్ 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి. తెలంగాణ సమస్యపై 2009 డిసెంబర్ 8వ తేదీన అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో తమ పట్టింపును వ్యక్తం చేశాయి. పార్లమెంటులో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని ప్రధాన ప్రతిపక్షం బిజెపి ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. బిల్లు ముసాయిదాను అభిప్రాయం కోసం రాష్ట్ర శాసనసభకు పంపాల్సి ఉంటుంది. దానిపై శాసనసభలో వోటింగ్ జరగదు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవడం లాంఛనమే.

సమైక్యాంధ్ర పేర రాయలసీమ, ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తమ తమ ప్రాంతాల్లో కృత్రిమ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. పార్టీ విధానాలకు భిన్నంగా పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతాల రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విస్తృత చర్చ అవసరమని 2009 డిసెంబర్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. దాంతో తెలంగాణలో ఆందోళనలు ఉధృమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత, కాలపరిమితిని కోరుతూ పార్టీలకు అతీతంగా తెలంగాణలోని రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఏకమై ఉద్యమాన్ని సాగించారు. విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. 2009 డిసెంబర్ 30వ తేదీన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘలా జెఎసి పిలుపు మేరకు తెలంగాణలో శాంతియుతంగా సంపూర్ణ బంద్ జరిగింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలను తెలంగాణపై చర్చలకు ఆహ్వానిస్తూ 2009 డిసెంబర్ 30వ తేదీన ప్రకటన చేసింది. రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం 2010 జనవరి 5వ తేదీన ఢిల్లీలో జరగనుంది.

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X