• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోస్తాంధ్ర సినిమా టార్గెట్ సీమ

By Pratap
|
Rakta Charitra
రక్త చరిత్ర లాభాలతో రక్తం కూడు తిన్నట్లేనని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్న మాటలు చాలా మందికి అర్థం లేనివిగా కనిపించవచ్చు. తాను సమరసింహా రెడ్డి సినిమాను కూడా వ్యతిరేకించానని ఆయన చెప్పడాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకుని కూడా ఉండరు. కానీ, మారెప్ప మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఉంది. ఓ వైపు తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కోస్తాంధ్ర ఆధిపత్యం కింద నలిగిపోతుండడం వల్లనే ముందుకు రావడం, కోస్తాంధ్రతో కలిసి ఉండడానికి తాము సిద్ధంగా లేమని కొంత మంది రాయలసీమ నాయకులు అంటుండడం ఆషామాషీ వ్యవహారాలేమీ కావు. ఆర్థికంగా బలపడిన కోస్తాంధ్ర సంపన్నవర్గాలు తెలుగు సినిమా రంగంపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాయి. సినీ పరిశ్రమలోని కొంత మంది తెలంగాణవాళ్లను, రాయలసీమవాళ్లను చూపించినంత మాత్రాన సినిమా రంగంపై కోస్తాంధ్ర ఆధిపత్యం లేదని చెప్పలేం. లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే తప్ప అది అర్థం కాదు. తెలంగాణ ప్రాంత సంస్కృతి, నాగరికతపై కోస్తాంధ్ర సినిమా తీవ్రంగా దాడి చేసింది. విజయవాడలో ఉన్న ముఠా కక్షల నేపథ్యంగా నడిచిన గాయం సినిమా కూడా చివరికి వచ్చే సరికి హైదరాబాద్ దుష్టత్వాన్ని ప్రధానం చేసుకుని ముగిసింది. ఆలా చూస్తే, వెనకబడిన ప్రాంతాలపై ఆధిపత్యం కోసం సినిమా రంగం తన వంతు పాత్రను మొదటి నుంచీ పోషిస్తూనే ఉందని చెప్పవచ్చు.

తెలంగాణపై విపరీతంగా దాడి చేసిన తెలుగు సినిమా కొంత కాలంగా రాయలసీమ మీద పడింది. ఫాక్షనిజంపై సినిమా పేరుతో రాయలసీమ విలనిజాన్ని, కోస్తాంధ్ర నాయకత్వాన్ని హైలెట్ చేస్తూ పోతోంది. తాజాగా, రక్త చరిత్ర అందుకు మంచి ఉదాహరణ. రాయలసీమలో ఫాక్షనిజం లేదని గానీ దౌర్జన్యాలు లేవని గానీ చెప్పలేం. కానీ దాన్ని చూడాల్సిన పద్ధతిలో చూడకుండా, దాని పరిమితులను విశ్లేషించకుండా, దాని పరిణామక్రమాన్ని అధ్యయనం చేయకుండా తీసే సినిమాలు ఆ ప్రాంతాన్ని అవమానించే విధంగానే ఉంటాయి. ఆ ప్రాంతాన్ని న్యూనతకు గురి చేసేవిగానే ఉంటాయి. తెలంగాణలోని రెడ్లను దొరల పేరుతో టార్గెట్ చేసుకున్న సినిమా రాయలసీమ రెడ్లను ఫాక్షనిజం పేరుతో టార్గెట్ చేసుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాతో రాయలసీమపై మొదలైన దాడి తాజాగా మర్యాద రామన్న చిత్రం దాకా సాగింది. రక్త చరిత్ర సినిమాతో అది పతాక స్థాయికి చేరుకుంది.

ప్రేమించుకుందాం రా సినిమాలో హీరో కోస్తాంధ్రకు చెందినవాడైతే, మర్యాద రామన్న సినిమాలో హీరో రాయలసీమకు చిన్ననాడే దూరమై వేరే ప్రాంతంలో పెరిగినవాడు. మర్యాద రామన్న సినిమా ఎంత అర్థరహితంగా ఉందో వాస్తవ పరిస్థితులు చూసినవారికి మాత్రమే తెలుస్తుంది. కాగా, బాలకృష్ణ సమరసింహారెడ్డి, చిరంజీవి ఇంద్ర సినమాలు హీరోలు, విలన్లు రాయలసీమవారే. ఆ రకంగా హీరోలను, విలన్లను అక్కడి వారినే చేసి రాయలసీమ అంటే నరుక్కోవడాలు, చంపుకోవడాలు, పగలూ ప్రతీరాకారాలు తప్ప ఏమీ లేవనే పద్ధతిలో సినిమాలు నిర్మించారు. సమరసింహా రెడ్డి వంటి సినిమాలు హిట్ కావడంతో రాయలసీమ కోస్తాంధ్ర ఆధిపత్యంలోని సినిమా రంగానికి ముడి సరుగ్గా మారింది. గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాకు కూడా అదే కథాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కూడా రాయలసీమ ఫాక్షనిజం లేనిదే సినిమాలు చేయలేని స్థితికి చేరుకున్నారు. హీరోలు, విలన్లు రాయలసీమ ప్రాంతానికే చెందినవారైనా హీరోలు కోస్తాంధ్ర భాషను మాట్లాడడం, విలన్లు రాయలసీమ భాషను మాట్లాడడం అనుకోకుండా జరిగిందేమీ కాదని అనుకోవచ్చు.

ఒక ప్రాంతంపై ఆధిపత్యం సంపాదించడానికి ఆ ప్రాంత సంస్కృతిని ధ్వంసం చేయాలి. దాన్ని ధ్వంసం చేయాలంటే ఆ ప్రాంతంలోని చెడును ఎక్కువ చేసి చూపాలి. మరో వైపు ఆ ప్రాంతం సంస్కృతి గౌరవప్రదమైంది కాదని చాటాలి. సినిమా తెలంగాణ విషయంలో చేసింది అదే. ప్రస్తుతం రాయలసీమ మీద చేస్తోంది అదే. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం వేరుపడినప్పుడు రాయలసీమవాసులు కోస్తాంధ్ర పెద్దలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ దాన్ని అమలు చేయలేదు. రాయలసీమలో పెడతామని హామీ ఇచ్చిన పెద్దలు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కోస్తాకు తరలించారు. కర్నూలు రాజధానిని తెలంగాణను విలీనం చేసుకోవడం ద్వారా హైదరాబాదుకు తరలించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నేపథ్యంలో రాయలసీమపై కోస్తాంధ్ర సంపన్న వర్గాలు రాయలసీమపై దాడిని ఉధృతం చేశారని అనుకోవచ్చునేమో.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X