కోదండరామ్ టార్గెట్ ఎందుకు?

కెసిఆర్ బలమంతా కోదండరామ్ లోనే ఉందనే భావన బలంగా ఉంది. ఆ భావనలో నిజం లేకపోలేదు కూడా. తెలంగాణవాదులను సంఘటితం చేసి, వారిని నడిపించడంలో, విశ్వవిద్యాలయంలోని ఓ వర్గం విద్యార్థులు ఆయన మాటలకు కట్టుబడి పని చేస్తుండడంలో కోదండరామ్ ది ప్రధాన పాత్ర. కోదండరామ్ కులపరంగా రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్. బహుశా పదవీ విరమణకు ఆయన దగ్గరు ఉండవచ్చు కూడా. దళిత, బహుజనులతో సానుభూతి ప్రకటిస్తూ, వారికి అనుకూలంగా ఉంటానని ప్రకటించుకోవడానికి ఆయన తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు. మొదటి నుంచి ఆయన పౌర హక్కుల ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణవాదాన్ని, అందునా భౌగోళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి పనిచేస్తున్నారు. తెరాసకు సంఘటిత బలాన్ని అందించడంలో ఆయనది ప్రధాన పాత్ర.
కోదండరామ్ కు ఉద్యమాల చరిత్ర ఉంది. అందుకే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత పరచడంలో చాలా వరకు విజయం సాధిస్తున్నారు. అది కెసిఆర్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తెరాస కోసమే తమను జెఎసి నుంచి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోదండరామ్ కెసిఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలహీనపరచడంలో తెలంగాణ జెఎసిది ప్రధాన పాత్ర. అందుకే, కోదండరామ్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మండి పడుతున్నారు.












Click it and Unblock the Notifications