వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలన తప్పదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
తెలంగాణ ప్రాంత శానసభ్యుల రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన 12, 13 మంది శానససభ్యులు మినహా మిగతా శాసనసభ్యులంతా రాజీనామాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హైదరాబాదుకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే, ఏడుగురు మజ్లీస్ శాసనసభ్యులు, ఓ సిపిఎం శానససభ్యుడు రాజీనామాలు చేసే అవకాశం లేదు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 119 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో ఒకటి ఇప్పటికే ఖాళీ అయింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ స్థానం ఖాళీగా ఉంది.

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన 11 మంది, సిపిఐ శానససభ్యులు నలుగురు, ఇద్దరు బిజెపి శానససభ్యులు రాజీనామాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత ఆ పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ శానససభ్యుల రాజీనామాల సంఖ్య వందకు చేరుకునే అవకాశం ఉంది. శాసనసభలో మొత్తం 294 స్థానాలున్నాయి. పోచారం రాజీనామాతో 293 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం శాసనసభలో లేకుండానే పోతుంది. దీన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు కూడా అవకాశంగా తీసుకుని రాజీనామాలు చేస్తే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. ఇప్పటికే కొండా సురేఖ రాజీనామా చేశారు. అయితే, ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. జగన్ వర్గానికి చెందిన తెలంగాణేతర శాసనసభ్యులు కూడా రాజీనామాకు దిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం కీలకమైన అంశం.

కాగా, తెలంగాణ శాసనసభ్యులంతా తమ రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మాట్‌లో డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కకు సమర్పించారు. ఈ రాజీనామా లేఖలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారు. అప్పటి వరకు రాజీనామాలు పెండింగులోనే ఉంటాయి. ఈలోగా కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీ శాసనసభ్యులను బుజ్జగించే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, వాళ్లు మాట వినే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కొంత మంది శాసనసభ్యులు అధిష్టానం మాటతో వెనక్కి వచ్చినా, పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే వాతావరణం లేదు. ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తెలంగాణ శాసనసభ్యులు వెనక్కి తగ్గితే మరింత చులకనవుతామనే భావనతో ఉన్నారు.

నాదెండ్ల మనోహర్ వచ్చి, రాజీనామాలను పరిశీలించిన తర్వాత కూడా ఆమోదం తెలుపుతారనే నమ్మకం లేదు. శాసనసభ్యులు దిగిరాకపోతే శాసనసభను సుప్తచేతనావస్థలో పెట్టి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. ఇందుకు పార్టీ అధిష్టానం సిద్ధపడుతుంది గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధపడదనే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా, కాంగ్రెసుకు, ఆ పార్టీ అధిష్టానానికి ఇది విప్పడానికి సాధ్యం కాని చిక్కుముడి మాదిరిగానే తయారైంది.

English summary
As the majority of the Telangana MLAs are resigned, president rule may be imposed in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X