వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ వెంట నడవడం కష్టమేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పనిచేయడాన్ని రాజకీయ నాయకులు ఇబ్బందిగానే భావిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. జగన్ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా వైయస్సార్ కాంగ్రెసులో మొదలైనట్లు అర్థమవుతోంది. తమను పట్టించుకోకుండా, తాను చెప్పినట్లు నడవాలనే వైఖరి వల్ల వైయస్ జగన్ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జగన్ విధానం కాదు. తాను తీసుకున్న నిర్ణయాలను తన వెంట నడుస్తున్న నాయకులు పాటించాల్సి ఉంటుంది. వాటి మంచిచెడుల గురించి చర్చించే వాతావరణం ఉండదు, ఆ సందర్భం కూడా రాదు. వైయస్ జగన్ వాణిజ్యవేత్త అని, వాణిజ్యవేత్తలు గుట్టుగా వ్యవహరిస్తారని, తాము నిర్ణయాలు తీసుకుని తన అనుచరులకు చెబుతారని వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకానొక సందర్భంలో అన్నారు.

వాణిజ్యవేత్తల పనితీరు రాజకీయాల్లో పనికి రాదని ఆయన చెప్పకుండానే చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి తాను చేయదలుచుకున్న పని గురించి చాలా మందితో మాట్లాడేవారని, దానివల్ల తాను చేయబోయే పనిలోని మంచీచెడులు తెలిసి వచ్చేవని ఆయన అన్నారు. గుట్టుగా వ్యవహరించే జగన్ వ్యవహార శైలి వల్ల నాయకులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బద్వేలు కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ వైయస్సార్ పార్టీకి దూరమయ్యారు. తాజాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి కూడా ఆయనకు దూరం జరిగారు. జగన్ వెంట నడుస్తున్న శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు ఏం చెప్తే అది చేసే వ్యక్తి కాటసాని రాంరెడ్డి. అటువంటి కాటసాని రాంరెడ్డే జగన్‌కు దూరమయ్యారంటే మరింత మంది కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

జగన్ వెంట నడుస్తున్న చాలా మంది శాసనసభ్యులు, నాయకులు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పరిణామాలను పసిగట్టే ఆయన ఆ విధంగా చెప్పి ఉంటారనేది స్పష్టమవుతోంది. నిజానికి, ఒక వ్యక్తి ఇష్టానిష్టాలకు, నిర్ణయాలకు అనుగుణంగా ఓ కార్పొరేట్ కంపెనీలాగా నడిచే పార్టీలో కొనసాగడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కూడా సంకటస్థితిని ఎదుర్కోవడానికి ఓ కారణం ఇదే. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ఉండదా అనే విషయాన్ని పక్కన పెడితే, పార్టీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, అధినేత తమ మాటలు వింటారని అనిపించడం పార్టీ మనుగడకు అత్యంత ప్రధానమైన విషయం.

తన తండ్రి వైయస్సార్ సంక్షేమ పథకాలు, ఆయన వారసత్వం, తనపై ఉన్న ప్రజాదరణ తన పార్టీని అగ్రస్థానంలో నిలబెడుతుందని బహుశా వైయస్ జగన్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, అది ఎల్లకాలం ఫలితాలు సాధించి పెట్టదు. నాయకులను తగిన విధంగా గుర్తించినప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరినీ గుర్తించినట్లు కనిపించేవారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని ఆయన చేతల్లో చూపించేవారు. అందుకే, హీరో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ వ్యవహార శైలి నచ్చక వెనక్కి వచ్చారు. వారంతట వారు తనను బలపరచాల్సిందే తప్ప బలపరిచిన వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని తలిస్తే జగన్ రాజకీయాల్లో దెబ్బ తినడం ఖాయం.

English summary
Leaders may desert one by one from YSR Congress party leader YS Jagan due to his functioning. The factor is he rejects to give importance to the leaders, who are following him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X