వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆత్మహత్య: ప్రతిపక్షాల టార్గెట్ కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని దాడికి దిగుతున్నాయి. కెసిఆర్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం, వామపక్షాలు మూకుమ్మడిగా ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తెలంగాణలో ప్రతి రోజూ సగటున ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి.

కెసిఆర్ మాయల ఫకీర్

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కెసిఆర్ ఎక్కువ వాగ్దానాలు ఇస్తున్నారని, 150 రోజుల పాలనలో ఇచ్చిన హామీలపై ఒరగబెట్టింది ఏమి లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్‌ కె.నారాయణ వ్యాఖ్యానించారు. మాయాల ఫకీర్‌ మాటలు చెబుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎలక్ట్రసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటీయూసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ఆయన కెసిఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, రైతులు, విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయలేదన్నారు. విద్యుత్‌ రంగంతోపాటు వివిధ రంగాల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మి నెంట్‌ చేస్తామని, రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చి నేడు విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని ఓ వైపు చెబుతూనే ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుకోవడం ఎంతవ రకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని, కాని రాష్ట్రంలో ఉన్న జెన్‌కోను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నలదీఽశారు. జెన్‌కోను బలహీనపరచడం వల్లనే తెలంగాణలో విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ మేల్కోని జెన్‌కోను అభివృద్ధి చేయడంతోపాటు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వారు చేపట్టే ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.

Opposition targets KCR on farmers suicides

తెలంగాణలో తుగ్గలక్ పాలన

తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు రాజకీయాలే సరిపోతున్నాయని, విద్యుత్‌ సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి కనిపించడంలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. రాబోయే మూడేళ్లూ ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు మిగులుతారా అని ప్రశ్నించారు. పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఉంటే కొత్త పరిశ్రమలు ఎక్కడినుంచి వస్తాయని ఉన్న పరిశ్రమలే తరలిపోతాయని చెప్పారు.

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యుత్‌ కొనుగోలుకు టెండర్లు పిలవకపోవడం శోచనీయమని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టినా ఆయన ధోరణి మారడంలేదని విమర్శించారు.

సమగ్ర సర్వేనే సర్వరోగ నివారిణిగా చెప్పి.. మళ్లీ రేషన్‌ కార్డుల దరఖాస్తుల తతంగమేంటన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలు, పింఛన్లను ఎగవేయడానికే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అవతలివారిని తిడితే చాలు తెలంగాణ ప్రజల కడుపులు నిండుతాయనుకుంటే అది సరికాదని, సెంటిమెంటు, విద్వేషాలు కొద్దిరోజులే పనిచేస్తాయని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు కూడా..

తెరాస ప్రభుత్వంపై తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా సమరానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రైతుల విషయంలో తెరాస ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేదంటే క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్‌ దాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో దొరల పాలన

రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. ఈ ప్రభుత్వం బీసీలను ఎదగకుండా అణగదొక్కుతున్నదని ఆయన విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ నిర్మాణం, బీసీలు, సవాళ్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.

జనాభాలో సగభాగం ఉన్న బీసీ విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేసి వారి జీవితాల్లో అంధకారం నింపాలనే కుట్రతో తెరాస ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపించారు. అన్ని పార్టీలు అగ్రకులాలకు చెందినవి కావడంతో బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పూర్తిస్తాయి నిధులతో రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథావిథిగా కొనసాగించి గత సంవత్సరానికి సంబంధించిన ఫీజుల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజు పథ కాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులతో రణరంగానికి కూడా సిద్ధమని హెచ్చరించారు.

ప్రభుత్వ హత్య

ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ మండలం, రాంపూర్‌ గ్రామానికి చెందిన రైతు వీరాస్వామి కుటుంబాన్ని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం పరామర్శించారు. రైతు ఆత్మహత్యకు తెరాస ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని పొన్నం డిమాండ్‌ చేశారు. వీరస్వామిది ఆత్మహత్య కాదని, తెరాస ప్రభుత్వం హత్య అని ఆయన విమర్శించారు. జిల్లాలో రైతులు సుమారు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని పొన్నం మండిపడ్డారు.

English summary
Telugudesam, Congress and other Telangana opposition parties made target CM K Chandrasekhar Rao on farmers suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X