వైయస్ జగన్‌తో టచ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితర నాయకులు వేదిక మీద ఉండగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. వారు నాటకాలు ఆడుతున్నారని, నిత్యం జగన్‌తో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వాస్తవాలు రాబట్టాలని, వారి సంభాషణలు వినాలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తామని వారు జగన్‌తో చెబుతున్నారని యువజన కాంగ్రెసు తాజా మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మను తుడిచేయాలని ముఖ్యమంత్రి ఆంతరంగికులు చెబుతన్నట్లు తెలుస్తోందని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ లేకపోవడంపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు తీవ్ర ఉద్వేగంతో ఆవేదిన వ్యక్తం చేస్తూ ప్రసంగించిన అనంతరం సుధాకర్ బాబు ఆ వ్యాఖ్యలు చేశారు. కాగా, ముందు వరుసలో కూర్చున్న మంత్రి రఘువీరా రెడ్డి మాత్రం వైయస్ బొమ్మ లేకపోవడంపై కెవిపి ఆక్షేపణ తెలుపుతూ ప్రసంగించినప్పుడు కంటతడి పెట్టారు.
ఆ తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ జరగనట్లే తన ప్రసంగాన్ని కానిచ్చారు. యువజన కాంగ్రెసు నాయకులకు, కార్యకర్తలకు హితోక్తులు చెప్పారు. కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications