షర్మిళ చేతుల్లోకి జగన్ పార్టీ పగ్గాలు?

వైయస్ జగన్ జైలు నుంచి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేకపోవడం, వైయస్ జగన్ సతీమణి భారతి కోర్టు వ్యవహారాలు, సంస్థల వ్యవహారాలు చూసుకోవడంలో మునిగిపోవాల్సి రావడం, వైయస్ విజయమ్మకు వయస్సు ఆటంకంగా మారడం వంటి కారణాలతో పోటీ రాజకీయాల్లో షర్మిళకు అవకాశాలు మెరుగవుతున్నాయి.
బయ్యారం గనులకు సంబంధించి ఆమె భర్త అనిల్ కుమార్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు మినహాయించి షర్మిళకు ఏ విధమైన ప్రతికూల అంశాలు లేవు. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసుకి షర్మిళ పెద్ద దిక్కుగా మారుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్రకు దీటుగా అటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అనివార్యతలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడింది. అంతటి సాహసం చేసేవారెవరన్నప్పుడు అనివార్యంగా షర్మిళ పేరు ముందుకు వచ్చింది.
వైయస్ జగన్ సోదరిగా కన్నా కూడా వైయస్ రాజశేఖర రెడ్డి కూతురిగా ఆమెకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. అమాయకంగా కనిపిస్తూనే ప్రత్యర్థులపై వాగ్బాణాలు విసిరే నైపుణ్యం షర్మిళ సొంతమని అంటున్నారు. ఈ స్థితిలో షర్మిళ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏకైక దిక్కుగా కనిపిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications