యాంటీ సచిన్ పోస్టు: మోడల్‌కు బోలెడు పేరు
కొచ్చి: చేయని తప్పునకు ఓ మలయాళీ మోడల్, వర్ధమాన నటి చిక్కుల్లో పడింది. థింకల్ భాల్ పేరు మీద ఆకతాయి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి, సచిన్ టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. సచిన్ టెండూల్కర్‌కు వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే భారత రత్న ప్రకటించిందని విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్య రాశాడు.
సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, క్రీడాకారులకు ఆ అవార్డు ఇవ్వాలనుకుంటే సచిన్ కన్నా ముందు ధ్యానచంద్, మిల్కా సింగ్, విశ్వనాథన్ ఆనంద్ తదితరులను పరిగణనలోకి తీసుకోవాలనేది ఆ వ్యాఖ్య.

సచిన్‌కు ఉన్నంత మంది అభిమానులు ఇతర క్రీడాకారులకు లేరని, మిగతా వారికి ఇస్తే తమకు పెద్ద యెత్తున ప్రశంసలు, ఓట్లు రావని ప్రభుత్వం భావించిందనేది తన ఉద్దేశమని ఆ ఆకతాయి అన్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రైవేట్ కంపెనీ బిసిసిఐకి ఆడుతున్నాడని, దేశం తరఫున ఆడడం లేదని కూడా ఆ ఆకతాయి వ్యాఖ్యానించాడు.
అంతే, ఒక్కసారిగా ఆ మోడల్ ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలోనూ, అసలు ఖాతాలోనూ తిడుతూ, విమర్శిస్తూ వ్యాఖ్యలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అది తన ఫేస్‌బుక్ కాదని, ఎవరో తన పేరు మీద ఖాతా తెరిచి, అటువంటి వ్యాఖ్యలు చేశారని వెంటనే ఆ మోడల్ వివరణ ఇచ్చింది. తన మిత్రుడు ఒకతను తన పేరు మీద ఫేస్‌బుక్ తెరిచాడని, దాన్ని క్లోజ్ చేయాలని చెప్పానని కూడా ఆ మోడల్ చెప్పింది.
చిక్కుల నుంచి బయటపడడానికి ఆమె ఇచ్చిన వివరణలో సచిన్ టండూల్కర్‌ను ప్రశంసించింది. మొత్తం మీద, సచిన్ కారణంగా ఆ మోడల్ పేరు అందరి నోళ్లలోనూ నానింది. ఆమెకు బోలెడు ప్రచారం లభించింది.












Click it and Unblock the Notifications