కెసిఆర్: ఎంపీ ఆవేదన, ఆట మొదలైందని రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కర్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అప్పుడే వివాదం ప్రారంభమైంది. తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించలేదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో తెలంగాణకు కేటాయించిన ఏడుగురిలో తాను సభ్యుడిని అయినప్పటికీ తనకు ఆహ్వానం అందక పోవడం బాధ కలిగించిందని చెప్పారు. ప్రోటోకాల్ పాటించేలేదని చెబుతూ రాపోలు ఆనంద భాస్కర్.. సోమవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.

రాష్ట్రం ఏర్పడే సమయంలో పార్లమెంటు సభ్యులుగా తమ వంతు పాత్ర కూడా కొంత ఉందనే విషయాన్ని పట్టించుకోకుంటే ఎలా అని ఆయన అన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైన సమయంలో ఎంపీలను ఆహ్వానించక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
మరోవైపు శాసన సభలో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
నిన్నటి వరకు సంధికాలమని, ఈ రోజు నుంచి ఆట మొదలైందని, ఈ ఆటలో కెసిఆర్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారు తప్ప యాజమాన్య హక్కులు కాదని రేవంత్ అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలన్నారు. హామీలు అమలు చేయకపోతే శాసనసభలో ఆయన సంగతి తేలుస్తామన్నారు. ప్రజల హక్కులకు కాపలాదారులుగా తాముంటామని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications