ఆలుగడ్డ శనగపప్పు మసాలా కూర ఇలా చేస్తే నాన్ వెజ్ కూడా పనికిరాదు!
ఆలుగడ్డలను రకరకాలుగా వండుకోవచ్చు. ఆలుగడ్డలను ఉడికించి ఫ్రై చేసుకోవడం, నేరుగా కట్ చేసి ఫ్రై చేసుకోవడం, వివిధ రకాల కూరల్లో ఆలుగడ్డను వేసి వండడం చేయవచ్చు. అయితే ఆలుగడ్డతో శనగపప్పును కూడా జత చేసి మసాలా కర్రీ వండితే అది అన్నంలోకి కాదు రోటీ లలోకి, దోసెల్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా ఆలుగడ్డ కూర తయారు చేయాలనుకునేవారు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు- అరకిలో
శనగపప్పు- 100 గ్రాములు
గరం మసాలా- ఒక స్పూను
అల్లం వెల్లిగడ్డ పేస్టు- ఒక స్పూను
ఉప్పు- రెండు స్పూన్లు( రుచికి తగినంత)
కారం- రెండు స్పూన్లు
పసుపు- అర స్పూను
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిరపకాయలు- నాలుగు
నూనె- మూడు స్పూన్లు
ధనియాల పొడి- ఒక స్పూను

తయారీ విధానం
ముందుగా గంటసేపు శనగపప్పును నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆలుగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కూరను కుక్కర్లో వండుకుంటే త్వరగా అవుతుంది. అలాగే రుచిగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి.
ఆలుగడ్డ, శనగపప్పు మసాలా కూర ఇలా
అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసి రెండునిమిషాలు ఉడికించాలి. ఆపై నానబెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో అర స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం, స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మళ్లీ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆపై అందులో తగినంత నీళ్లుపోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
అన్నం, రోటీ, దోసెలకు బెస్ట్
మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిసేపటి తర్వాత కుక్కర్ మూత తీసి మళ్లీ స్టవ్ ఆన్ చేసి కూరను ఉడికించుకోవాలి కూర మరి పలుచగాను, లేదా మరీ చిక్కగా లేకుండా వేసుకునే కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడే దాంట్లో ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో కానీ, రోటిలో కానీ దోశలో కానీ తింటే ఎంతో బాగుంటుంది. ట్రై చేయండి.












Click it and Unblock the Notifications