సంక్రాంతికి భోగి పండ్లు.. మనం తినే రేగు పండ్లు. ఔషధాల గనిగా ఎలా మారాయి?
భోగి పండుగ వచ్చిందంటే... భోగి మంటలు, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో చిన్నారుల నవ్వులు గుర్తుకు వస్తాయి. ఆ చిన్నారులపై భోగి పండ్లు పోయడం వెనక ఉన్న ఆచారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు... ఆరోగ్యంతో ముడిపడ్డ ఒక గొప్ప శాస్త్రమనే చెప్పాలి. రేగుపండ్లు, చెరకు ముక్కలు, పూలు, నాణేలు కలిపి పిల్లలపై పోయడం ద్వారా వారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, బలాన్ని కోరుతూ పెద్దలు ఆశీర్వదిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం వెనక ఉన్న ఔషధ విలువలను ఇప్పుడు వైద్య నిపుణులే అంగీకరిస్తున్నారు.
రేగుపండ్లు తీపి, పులుపు, వగరు కలిసిన రుచితో పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టమైన పండు. అయితే ఇవి రుచితోనే కాదు... శరీరానికి అవసరమైన పోషకాలతో ఒక ఔషధాల గనిలా పనిచేస్తాయి. రేగులో సహజంగా ఉండే రోగనిరోధక గుణాలు శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి. చిన్న పిల్లల్లో తరచూ వచ్చే జలుబు, దగ్గు, జ్వరాల నుంచి రక్షణ కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే భోగి పండ్లలో రేగుపండ్లకు ముఖ్య స్థానం ఉంటుంది.
ఈ పండ్లు మెదడును ప్రశాంతంగా ఉంచడంలోనూ సహాయపడతాయి. నిద్ర సరిగ్గా పట్టని వారు, ఎక్కువగా ఆందోళనకు గురయ్యేవారు రేగుపండ్లు తీసుకుంటే మనస్సుకు హాయిగా ఉంటుందని పెద్దలు చెప్పడం వెనుక కారణం ఇదే. చిన్నారుల్లో చలాకీతనం, ఏకాగ్రత పెరగడానికి కూడా ఇవి దోహదపడతాయి. అందుకే బోగి పండ్లు పిల్లలపై పోసేటప్పుడు "బుద్ధి, బలం పెరగాలి" అని ఆశీర్వదిస్తారు.

జీర్ణాశయ ఆరోగ్యానికి రేగుపండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పీచు కడుపు పనితీరును మెరుగుపరచి అజీర్తి, పొట్టమంట, నోటి పుండ్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. పిల్లలైనా, పెద్దలైనా తరచూ ఎదుర్కొనే కడుపు సమస్యలకు ఇది సహజ పరిష్కారం. ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు పెరగకుండా చూసే గుణం కూడా వీటిలో ఉంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా రేగు పండ్లు ఉపయోగపడతాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉండటంతో ముఖంపై మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గి బలం పెరుగుతుంది. పిల్లల్లో చర్మ సమస్యలు రాకుండా, పెద్దల్లో ముందస్తు వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి.
ఇక ఎముకల బలం విషయానికి వస్తే... రేగుపండ్లలో ఉండే ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పిల్లల ఎదుగుదలకు, పెద్దల్లో కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇవి ఉపయోగపడతాయి. మహిళల్లో నెలసరి సమస్యలు, వయస్సు పెరిగే దశలో వచ్చే శారీరక ఇబ్బందులకు కూడా ఇవి ఉపశమనం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే భోగి పండ్లు కేవలం పండుగ ఆచారం కాదు... చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంపూర్ణ ఆరోగ్య సంప్రదాయం అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications