చేమ దుంపల పులుసు .. ఇలా చేసి వేడి అన్నంలో తింటే మాములుగా ఉండదు!
మనం తినే ఆహారంలో దుంప కూరలు కూడా అప్పుడప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. దుంప కూరలు కూడా మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో దోహదం చేస్తాయి. అటువంటి దుంప కూరలలో చేమదుంపలు ఒకటి. ఈరోజు మనం రుచికరమైన చేమదుంపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
చేమదుంపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు
చేమదుంపలు- పావు కిలో
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరపకాయలు- 4
చింతపండు- నిమ్మకాయంత
ఉప్పు- రెండు టేబుల్ స్పూన్లు రుచికి తగినంత
పసుపు- అర టేబుల్ స్పూన్
కారం- రెండు టేబుల్ స్పూన్లు రుచికి తగినంత
పోపు గింజలు- ఒక స్పూన్
నూనె- మూడు స్పూన్లు
కరేపాకు- రెండు రెమ్మలు
జిలకర మెంతుల పొడి- ఒక స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూన్

తయారీ విధానం
చేమదుంపల పులుసు తయారు చేయడానికి ముందుగా చేమదుంపలు ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి పోపు గింజలు ఒక స్పూన్ వేసి, ఆపై కరివేపాకు వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు చేమదుంపలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
చేమ దుంపల పులుసు ఇలా చేస్తే బెస్ట్
ఆపై అందులో అర స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి మళ్లీ మగ్గనివ్వాలి. తర్వాత అందులో నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన గుజ్జును పోసుకోవాలి. పులుసు మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది చూసుకొని దాన్నిబట్టి పులుసు పోసుకోవాలి. పులుసు మరుగుతున్న సమయంలో జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ , ధనియాల పొడి ఒక స్పూన్ వెయ్యాలి.
చేమ దుంపల పులుసుతో ఆరోగ్య ప్రయోజనాలు
కాసేపు సిమ్ లో పెట్టుకొని పులుసు ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన చేమదుంపల పులుసు తయారవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది. చేమదుంపల పులుసు మన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇది డయాబెటిస్ బాధితులకు చాలా మంచిది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి ,జీర్ణ సంబంధ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications