మెషిన్ కాఫీ తాగితే ఆరోగ్యానికి ముప్పు ఉందా.. పరిశోధకులు ఏం చెబుతున్నాయి?
ఆఫీస్‌లో కాఫీ లేకుండా ఒక్కరోజు ఊహించగలరా? ఉదయం పనిభారం పెరిగినప్పుడు, మధ్యాహ్నం అలసట పెరిగినప్పుడు.. కాఫీ తాగితేనే చైతన్యం వస్తుందని భావించే ఉద్యోగులు కోకొల్లలు. అయితే, మీ డెస్క్ పక్కనే ఉన్న ఆఫీస్ కాఫీ మెషిన్‌లో తయారైన కాఫీ.. ఆరోగ్యానికి హానికరమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా.. రోజూ ఆఫీస్ కాఫీ తాగే ఉద్యోగుల్లో కొలెస్ట్రాల్ పెరిగే ముప్పు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాఫీలో అనారోగ్యకరమైన పదార్థాలు!
స్వీడన్‌లోని ఉప్ప్సాలా విశ్వవిద్యాలయం (Uppsala University) , చల్మర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (Chalmers University of Technology) పరిశోధకులు ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. 'న్యూట్రిషన్, మెటాబాలిజం & కార్డియోవాస్క్యులర్ డిసీసెస్' (Nutrition, Metabolism & Cardiovascular Diseases) అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా, 14 రకాల ఆఫీస్ కాఫీ మెషిన్స్‌లో తయారైన కాఫీ నమూనాలను పరీక్షించారు. ఆశ్చర్యకరంగా.. మెషిన్ రకాన్ని బట్టి కాఫీలోని కొలెస్ట్రాల్ పెంచే పదార్థాల స్థాయిలో భారీ వ్యత్యాసం కనిపించింది. ఒకే మెషిన్‌లో కూడా ఒక్కోసారి విభిన్న స్థాయిలో ఉన్నాయని తేల్చారు.

కొలెస్ట్రాల్ పెంచే ప్రధాన కారణం ఏమిటి?
కాఫీలో సహజంగా ఉండే 'కఫెస్టోల్' (Cafestol), 'కాహ్వియోల్' (Kahweol) అనే రెండు పదార్థాలే కొలెస్ట్రాల్ పెంచే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి రక్తంలో LDL (Bad Cholesterol) స్థాయిని పెంచే ప్రమాదం ఉంది. బాగా మరిగించిన కాఫీలో ఈ పదార్థాలు అధికంగా ఉండటంతో, నార్డిక్ దేశాల్లో (Nordic countries) బోయిల్ కాఫీ తక్కువగా తాగాలని ఇప్పటికే డైట్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
ఎలాంటి కాఫీ మంచిది?
సాధారణంగా డ్రిప్-ఫిల్టర్ కాఫీ మెషిన్స్ (Drip-filter Coffee Machines) ఉపయోగించినప్పుడు, కాఫీలోని ఈ హానికర పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే, పేపర్ ఫిల్టర్ వాటిని బాగా తొలగిస్తుంది. కానీ, బహుళ కంపెనీల ఆఫీస్‌ల్లో వాడే కొంతమంది కాఫీ మెషిన్స్ మాత్రం ఈ ఫిల్టరేషన్ పూర్తిగా చేయలేకపోతున్నాయని ఈ పరిశోధనలు హెచ్చరిస్తోంది.
తప్పించుకోవడానికి మార్గం?
"అధికంగా కాఫీ తాగే ఉద్యోగులు, ముఖ్యంగా రోజుకు 3-4 కప్పులు తాగేవారు కొలెస్ట్రాల్ పెరిగే ముప్పును అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఆఫీస్‌లో పేపర్-ఫిల్టర్ ఉన్న కాఫీ మెషిన్ వాడితే.. ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు" అని పరిశోధకులు సూచిస్తున్నారు.
కావాలంటే కాఫీ తాగండి.. కానీ జాగ్రత్త!
ఎంతోమంది ఉద్యోగుల ఉదయం మొదలయ్యేది కాఫీతోనే! కానీ అదే కాఫీ కొలెస్ట్రాల్ పెంచే ప్రమాదం ఉందన్న నిజాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్-ఫిల్టర్ కాఫీకి మారడం ఉత్తమం. ఎందుకంటే.. ప్రతి రోజు తాగే ఆఫీస్ కాఫీ మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చు!
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహా కోసం మీ వైద్య నిపుణుడిని సంప్రదించండి












Click it and Unblock the Notifications