"దొండకాయ గోంగూర" పచ్చడి ఎప్పుడైనా తయారీ చేశారా..?
తెలుగు వారి వంటగదిలో గోంగూరకు ఉండే స్థానమే వేరు. దీనిని కేవలం ఒక ఆకుకూరగా కాకుండా, "ఆంధ్ర మాత" అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు. గోంగూర లేనిదే తెలుగు వారి విందు పూర్తి కాదు అని అంటే అతిశయోక్తి కాదు. అందుకే గోంగూరతో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గోంగూర పచ్చడి: రోటి పచ్చడి అయినా, నిల్వ పచ్చడి అయినా గోంగూర రుచే వేరు. వేడి వేడి అన్నంలో నెయ్యి, గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఆ తృప్తి అమూల్యం. అలానే గోంగూర పప్పు,మాంసాహార ప్రియులకు 'గోంగూర మటన్' లేదా 'గోంగూర చికెన్' ఒక అద్భుతమైన కాంబినేషన్ గా ఉంటుండి.
అయితే గోంగూర కాంబినేషన్‌లో మీరు ఇప్పటివరకు రుచి చూడని ప్రత్యేకమైన పచ్చడిని ఇప్పుడు తెలుసుకుందాం. అదే నోరూరించే "దొండకాయ గోంగూర" పచ్చడి. ఈ సరికొత్త పచ్చడి ఎన్నడూ లేని కమ్మదనాన్ని అందిస్తుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలనిపిస్తుంది. దొండకాయ ఇష్టం లేని వారు సైతం ఈ పచ్చడిని తెగ ఇష్టపడతారు. దీని రుచికి ఇంట్లో వారంతా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ ప్రత్యేకమైన దొండకాయ గోంగూర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, విధానం మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు..
- గోంగూర - ఒక పెద్ద కప్పు
- దొండకాయలు - పావుకిలో
- నూనె - తగినంత
- ఆవాలు - ఒక చెంచా
- జీలకర్ర - ఒక చెంచా
- ఎండుమిర్చి - నాలుగైదు
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - మూడ్నాలుగు
- పసుపు - కొద్దిగా
- ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం..
- ముందుగా తాజా గోంగూరను కాడల నుంచి వేరుచేసి శుభ్రంగా కడిగి, అదనపు నీరు పోయేలా జల్లెడలో వేసి పక్కన పెట్టుకోవాలి.
- ఈలోపు దొండకాయలను శుభ్రంగా కడిగి, చిన్న పొడవాటి ముక్కలుగా తరగాలి.
- అలాగే పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి.
- పాన్‌లో తగినంత నూనె వేడిచేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. (అవి వేగాక, పచ్చిమిర్చి చీలికలు, పసుపు వేసి బాగా కలపాలి)
- ఆ తర్వాత, కడిగిన గోంగూరను వేసి, మధ్యమధ్యలో కలుపుతూ నూనెలో బాగా మగ్గి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి.
- గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆపి, చల్లారనివ్వాలి.
- గోంగూర చల్లారేలోపు, మిక్సీ జార్‌లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై మగ్గించిన గోంగూర మిశ్రమాన్ని వేసి, గరిటెతో కలియతిప్పి, రోటి పచ్చడిలా కచ్చాపచ్చాగా మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
- రోలు అందుబాటులో ఉన్నట్లయితే, ముందుగా దొండకాయలను దంచి, ఆపై గోంగూర మిశ్రమాన్ని వేసి రుబ్బుకోవాలి. ఇలా చేస్తే మిక్సీలో చేసిన పచ్చడి కంటే మరింత రుచికరంగా ఉంటుంది.
- గ్రైండ్ చేసిన పచ్చడి మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడు నోరూరించే దొండకాయ గోంగూర పచ్చడి అప్పటికప్పుడు సిద్ధమవుతుంది.
వేడి వేడి అన్నంలో కలిపి తింటే దీని రుచి నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.












Click it and Unblock the Notifications