జుట్టు రాలటాన్ని శాశ్వతంగా వదిలించుకోండి; ఈ ఆయుర్వేద నూనెను ఇంట్లోనే తయారుచేసుకుని వాడండి!!
చాలామంది ప్రస్తుతం జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జుట్టు రాలడం అనేది సాధారణమైన అంశంగా మారిపోయింది. జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడటం కోసం చాలామంది రకరకాల ఖరీదైన నూనెలను ఉపయోగిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెంచుతుంది అని మార్కెట్లో వచ్చే ప్రకటనలను చూసి చాలామంది రకరకాల నూనెలను కొనుగోలు చేస్తున్నారు.
అయితే వాటి అన్నిటి కంటే మన ఇంట్లోనే మనకు తెలిసిన వస్తువులతో తయారు చేసుకునే ఒక ఆయుర్వేద నూనె జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేసే ఆ ఆయుర్వేద నూనెను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ముందుగా దీనికి కావలసిన పదార్థాలను చూస్తే, నాలుగు కప్పుల ఆవాల నూనె, మూడు కప్పుల కడిగిన కరివేపాకు, అర కప్పు ఎండిన మందార పువ్వులు, అర కప్పు మెంతులు, అరకప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలి. ముందుగా పెద్ద పాత్రలో నూనె వేసి అందులో కరివేపాకు వేసి వేడి చేయాలి.
కాస్త రంగు మారిన తరువాత ఆ నూనెలో ఉసిరి ముక్కలు, మెంతులు, ఎండిన మందార పువ్వులు వేయాలి. దీనిని బాగా మరిగించాలి. ఈ పదార్థాలలో ఉన్న సారమంతా నూనె లోకి చేరేదాకా మరిగించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి దీనిని 12 గంటల నుండి 24 గంటల పాటు ఉంచి ఆపై శుభ్రమైన కంటైనర్ లోకి వడకట్టుకోవాలి.
ఇక ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు మర్దన చేసి, కొన్ని గంటల పాటు అలాగే ఉంచి ఆపై తేలికైన షాంపుతో జుట్టును కడుక్కోవాలి. ఈ నూనెను వారానికి కనీసం రెండుసార్లు అయినా రాస్తే జుట్టు ఊడటం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
మార్కెట్లో దొరికే నూనెల కంటే ఈ నూనె మనం స్వయంగా తయారు చేసుకుంటాం కాబట్టి జుట్టుకు కావలసిన అన్ని రకాల పోషకాలను ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆయుర్వేద నూనెను ఇంట్లోనే తయారు చేసుకొని జుట్టు రాలే సమస్యల నుంచి బయటపడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications