Health News: అనారోగ్యాలకు అడ్డాగా జిమ్ సెంటర్లు.. కాసుల కక్కుర్తితో అడ్డగోలు వ్యవహారాలు
Gym News: శరీర సౌష్ఠవంతో పాటు ఆరోగ్యం కోసం ప్రస్తుతం అందరూ జిమ్‌ల బాట పడుతున్నారు. గతంలో కేవలం సినిమా తారలు, క్రికెటర్స్, ఆటగాళ్లు మరియు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన జిమ్స్.. క్రమంగా నగర యువతకు దగ్గరయ్యయి. పలు రోగాలు, వ్యాధుల చికిత్స నిమిత్తం వైద్యులు కూడా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ సహా వివిధ రకాలైన వ్యాయామాలు సూచించడం వల్ల జిమ్స్ వినియోగం ఎక్కువైంది. అవసరం మేర వీటిని వినియోగిస్తే తప్పు లేదు కానీ జిమ్స్‌లో ఇష్టానుసారంగా వ్యవహారాలు జరుగుతున్నాయనే ఆరోపణల వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆయా జిమ్ సెంటర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని జిమ్‌లకు పలు రకాల డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. మానసిక ఒత్తిడి బారి నుంచి తప్పించుకునేందుకు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఆయా జిమ్స్ నిర్వాహకులే మందులు వాడాలని సూచిస్తున్నట్లు తేలింది.

డైట్‌తో పాటు మందులు కూడా వినియోగిస్తేనే ఫిట్‌నెస్ సాధ్యమని ట్రైనర్లు సూచిస్తుండటంతో వాటి గురించి తెలియని అమాయకులు బలవుతున్నారు. ప్రభుత్వాలు నిషేధిస్తున్నా పోలీసుల కళ్లుగప్పి దొంగచాటుగా రవాణా చేస్తున్నారు. వీటిని అడ్డం పెట్టుకుని వేలల్లో అధికంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జిమ్ ట్రైయినర్లలో సింహభాగం ఎంటువంటి వైద్య పరిజ్ఞానం లేనివాళ్లేనని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా దిగ్గజ కంపెనీలు సైతం జిమ్ సెంటర్లతో భాగస్వామ్యమై సిబ్బందికి మెంబర్‌షిప్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ తరహా సదుద్దేశం కాస్తా డ్రగ్స్ వంటి నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగంతో పక్కదారి పడుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జిమ్స్ మాత్రమే కాకుండా స్పాలు, మసాజ్ సెంటర్లు, ఏరోబిక్స్, జుంబా వంటి వివిధ పేర్లతో వ్యాయామ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే వాటి మాటున వ్యభిచారం జరుగుతున్న వార్తలు తరచూ వింటుండటంతో అక్కడికి వెళ్లాలంటేనే భయపడే విధంగా పరిస్థితి మారిపోయింది.












Click it and Unblock the Notifications