ఒంటరితనం.. ఆరోగ్యానికి హానికరం
మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒంటరితనం అనారోగ్యానికి దారితీస్తుంది. డిప్రెషన్, ఆందోళన, మానసిక వ్యాధులకు దారితీస్తుంది. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఒంటరిగా ఉండటమంటే 15 సిగరెట్లు తాగడంతో సమానమని యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి తెలిపారు. రోజుకు 15 సిగరెట్లు తాగితే మరణాలపై అదే ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.

సామాజిక సంబంధాలు, మరణాలను విశ్లేషిస్తూ 2010లో ప్రచురించిన ఒక అధ్యయనాన్ని ఈ సందర్భంగా వివేక్ ఉదహరించారు. పరిశోధకులు తమ ప్రశ్నలకు మరింత బలమైన గణాంక విశ్లేషణ పొందడానికి మెటా-విశ్లేషణ అనే అంశంపై 148 పరిశోధనల నుంచి వచ్చిన డేటాను ఇందులో కలిపారు. సగటున ఏడున్నర సంవత్సరాలపాటు అధ్యయనంలో 3 లక్షల మంది పాల్గొన్నారు. సామాజిక సంబంధాలు అకాల మృత్యువు ప్రమాదాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయనే అంశంపై అన్వేషించారు.

ఒంటరి వ్యక్తులు అకాల మరణాన్ని పొందడానికి 50 శాతం ఎక్కువ అవకాశం ఉందని తేలింది. ఒంటరితనం ఆరోగ్యానికి హానికరం. ఒంటరితనం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఆల్కహాల్ వినియోగించేవారితో సమానంగా ఉంటాయి. ఎటువంటి వ్యాయామం చేయనివారు, ఊబకాయంతో బాధపడేవారికంటే ఇది అధికమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటరితనం వల్ల నిద్ర సమస్యలతోపాటు డిప్రెషన్, మద్యపానం వంటివి అలవాటవుతాయి. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండేవారికి మరింత ప్రమాదముంది. కరోనా తర్వాత ఒంటరితనం అనుభవించేవారి సంఖ్య బాగా పెరిగిందని వివేక్ మూర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications