Health : విటమిన్ డీ లోపంతో గుండె జబ్బుల రిస్క్ ? తాజా అధ్యయనంలో వెల్లడి..
విటమిన్ డీకీ మన గుండెకూ ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. మన గుండె సురక్షితంగా ఉండాలంటే విటమిన్ డీ తప్పనిసరి. ఇది లోపిస్తే గుండె పై పడే ప్రభావం ఏంటో తెలిస్తే మాత్రం షాక్ కాక తప్పదు. తాజాగా వెలువడిన స్విస్ అధ్యయనం ఒకటి దీనిపై వాస్తవాలేంటో బయటపెట్టింది. ఈ అధ్యయనంలో విటమిన్ డీ లోపం కారణంగా పడే ప్రభావాలపై శాస్త్రవేత్తలు పలు కీలక విషయాలు వెల్లడించారు.
విటమిన్ డి సప్లిమెంట్స్ వాడకం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందా అంటే స్విస్ అధ్యయనం అవునంటోంది. ఇటీవలి స్విస్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఫౌండేషన్ చేసిన అధ్యయనం తక్కువ విటమిన్ డి స్థాయిలు, హృదయ సంబంధ జబ్బుల ప్రమాదం మధ్య బలమైన సంబంధాలను చూపుతోంది. సీనియర్ కార్డియాలజిస్టులు సాధారణ విటమిన్ డి స్థాయిలను నిర్వహించడం గ్లూకోస్ టాలరెన్స్ పరంగా మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుందని, అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, బలమైన ఎముకలు, కండరాల వ్యవస్థను అందిస్తుందని భావిస్తున్నారు.

అలాగే గుండె ఒక కండరం కాబట్టి ఆ మేరకు మంచి విటమిన్ డి స్థాయిలను కలిగి ఉండటం చాలా అవసరం అనడంలో సందేహం లేదంటున్నారు. అయినప్పటికీ విటమిన్ డి స్థాయిలను పెంచడం హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందని నిర్ధారించడానికి ఇంకా పూర్తిస్దాయిలో అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున అధ్యయనాలలో ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తే అప్పుడు మాత్రమే విటమిన్ డిని చికిత్సలో భాగంగా పరిగణించగలమని వారు చెప్తున్నారు.
కొవ్వులో కరిగే విటమిన్ డీ.. ధమనులను అనువైనదిగా , రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడుతుందని హార్వర్డ్ టి హెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చెబుతోంది. తద్వారా ఇది సంకోచానికి గురి కాదంటోంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుందని చెబుతోంది. శరీరంలోని అనేక అవయవాలు, కణజాలాలలో విటమిన్ డి కోసం గ్రాహకాలు ఉన్నాయి.
ఇవి ఈ విటమిన్ పోషించే ముఖ్యమైన పాత్రను సూచిస్తున్నాయి. అనేక అధ్యయనాల విశ్లేషణలో విటమిన్ డీ అత్యధిక స్థాయిలో ఉన్న వారితో పోలిస్తే తక్కువ సీరం విటమిన్ డి ఉన్న వ్యక్తులకు స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అయితే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ ప్రమాదాన్ని తగ్గించగలిగినట్లు మాత్రం నిరూపణ కాలేదు.












Click it and Unblock the Notifications