చలికాలంలో 'టమాటో కొత్తమీర సూప్'.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!
చలికాలంలో ఏదైనా వేడివేడిగా చేసుకుని తింటేనే బాగుంటుంది. శీతాకాలంలో ఎక్కువగా వేడివేడి రసాలు, సూప్ లు చేసుకుంటారు. అయితే అందులో 'టమాటో కొత్తమీర సూప్' ఒకటి. ఈజీగా చేసుకోవడమే కాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ టమాటో కొత్తమీర సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
'టమాటో కొత్తమీర సూప్' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టమాటో పావు కిలో, పచ్చిమిర్చి రెండు, నూనె ఒక టీ స్పూన్, నెయ్యి లేదా వెన్న అర టీ స్పూన్, దంచిన అల్లం కొద్దిగా, దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు, యాలకులు మూడు, లవంగాలు రెండు, దాల్చిన చెక్క, మిరియాలు హాఫ్ స్పూన్, గోధుమ పిండి ఒక స్పూన్, కారం తగినంత, కొత్తిమీర తురుము తగినంత, నీళ్లు తగినంత తీసుకోవాలి.
'టమాటో కొత్తమీర సూప్' తయారీ విధానం చూస్తే.. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత అందులో దంచిన వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులో గోధుమ పిండి వేసుకుని మంచి వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి.

ఆ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. అందులోనే కారం, ఉప్పు సరిపడా వేసి కలపాలి. అందులోనే పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. అలా టమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి సిమ్ లో పెట్టి మరగనివ్వాలి. అలా నీళ్లు సగానికి అయ్యేంతవరకూ మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టుకోవాలి. ఆ సూప్ పై కొత్తిమీర చల్లితే సరి.. దాంతో ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర సూప్ రెడీ అయినట్టే.












Click it and Unblock the Notifications