గోంగూర శనగపప్పు కూరతో బరువు తగ్గుతారు.. ఇలా ట్రై చెయ్యండి!
ప్రతిరోజు మనం తినే కూరలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే కూరలను తినేటప్పుడు ఏ కూరలతో ఎక్కువ మన శరీరానికి పోషకాలు వస్తాయి? ఏ కూరలు మన ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి? వంటి అనేక విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరలలో గోంగూర కు ఒక విశేషమైన స్థానం ఉంది.
గోంగూర శనగపప్పు కూర
గోంగూర విటమిన్ సి తో పుష్కలంగా ఉండి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇక అటువంటి గోంగూరతో, శనగపప్పును కలిపి వండి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి గోంగూర శనగపప్పు కూరని ఏ విధంగా వండాలి అనేది తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
గోంగూర - రెండు కట్టలు
శనగపప్పు - 100 గ్రాములు
ఉల్లిపాయ - పెద్దది ఒకటి
పచ్చిమిరపకాయలు - 5
పసుపు - హాఫ్ స్పూను
ఉప్పు - రెండు టేబుల్ స్పూన్లు
కారం - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పోపు గింజలు - ఒక స్పూను
ఎండుమిరపకాయలు - రెండు
కరివేపాకు - రెండు రెమ్మలు
వెల్లి పాయలు - 4 రెబ్బలు
తయారీ విధానం
మొదట గోంగూరను తొడిమలు లేకుండా చూసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. 100 గ్రాముల శనగపప్పును ముందే నానబెట్టుకొని, తెంచుకున్న గోంగూరను, శనగపప్పును, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత కుక్కర్ ను దించి ఉడికిన గోంగూర శనగపప్పును మెదుపుకోవాలి. అందులో అరస్పూను పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసుకోవాలి.
గోంగూర శనగపప్పు పోపుతోనే టేస్ట్
ఆపై కలిపి మళ్లీ స్టౌ పైన పెట్టి సన్న సెగ మీద ఉడికించాలి. ఇక మరొక పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె పోసి, నూనె వేడయ్యాక రెండు ఎండు మిరపకాయలను తుంచి వేసుకొని, పోపు గింజలు కూడా వేసి కొంచెం కలర్ మారేవరకు వేయించాలి. ఆపై అందులో నాలుగు వెల్లిపాయ రెబ్బలను ఒలిచి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి.
గోంగూర శనగపప్పుతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
ఆపై కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ పోపును గోంగూర శనగపప్పు ఉడుకుతున్న దానిలో కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ గోంగూర శనగపప్పు కూర తింటే మన శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు అందుతాయి. ఎముకలు బలోపేతం అవుతాయి.
బరువు తగ్గాలంటే ఇలాంటి కూరలే తినాలి
కూరలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఆకలిని తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి ఇటువంటి కూరలు చాలా బాగా ఉపయోగపడతాయి.












Click it and Unblock the Notifications