astrology: నవగ్రహాలకు ఇష్టం లేని పనులు ఇవే; అస్సలు చెయ్యొద్దు!!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే గ్రహాల అనుకూలత కచ్చితంగా ఉండాలి. నవ గ్రహాలు అనుకూలిస్తేనే మన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. నవగ్రహాలు అనుకూలించకపోయినా, నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు మనం చేసినా మన జీవితంలో ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది.
మన జీవితాన్ని నిర్దేశించే నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు ఏంటి? ఏ గ్రహానికి ఏం పని చేస్తే కోపం వస్తుంది? నవగ్రహాలు మనకు అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే మనం ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.సర్వ శాస్త్రాలు తెలిసిన గురువైన బృహస్పతికి కోపం రాకుండా ఉండాలంటే గురువులను గౌరవించాలి. ఎవరైనా గురువుని కించపరిస్తే బృహస్పతికి కోపం వస్తుందని చెబుతారు.

ఇక బుధుడికి ఎవరైనా వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తనకే ఎక్కువ జ్ఞానం ఉందని విర్రవీగినా కోపం వస్తుందని చెబుతారు. అంతేకాదు చెవిలో వేలు పెట్టుకుంటే బుధుడికి విపరీతమైన కోపం వస్తుందని, బుధవారం ఆ పని అస్సలు చేయకూడదు అని చెబుతారు. ఇక అద్దం పుట్టడానికి కారణమైన చంద్రుడు మన జీవితంలో మంచి ఫలితాలను ఇవ్వాలంటే ఆయనకు కోపం రాకుండా చూసుకోవాలి. అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వెక్కిరించడం వంటివి చేస్తే చంద్రుడికి విపరీతమైన కోపం వస్తుందని చెబుతారు.
ఇక శని దేవుడికి మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, పెద్దవారిని కించపరిచినా , తల్లి తండ్రిని చులకనగా చూసినా కోపం వస్తుందని చెబుతారు. శని దేవుడు ఎవరికైనా సేవ చేసేవారికి అనుకూల ఫలితాలను ఇస్తారని చెబుతారు.ఎవరైనా పితృదేవతలను దూషిస్తే సూర్య దేవుడికి కోపం వస్తుందని అంతే కాదు సూర్య దేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసినా, దంతధావనం చేసిన కోపం వస్తుందని చెబుతారు.
అప్పు ఎగ్గొడితే కుజగ్రహానికి కోపం వస్తుందని, వ్యవసాయ పరంగానూ మోసం చేస్తే కుజుడు సహించడని చెబుతారు. ఇక శుక్రగ్రహానికి భార్య, భర్త ఒకరినొకరు అగౌరవపరుచుకుంటే కోపం వస్తుందట. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రుడు కృప కూడా ఉండదని చెబుతారు. ఇక లక్ష్మీదేవి భర్తలేని ఇంట్లో నివసించలేదని, గొడవలు పడే ఇంట్లో ఉండబోదని చెబుతారు.
కేతువుకి పెద్దలు మరణించిన తర్వాత చేయాల్సిన క్రతువులు చేయకపోతే విపరీతమైన కోపం వస్తుందని చెబుతారు. మన జాతకంలో కేతువు మంచి స్థానంలో లేకపోతే, లేక ఆయనకు కోపం వస్తే పిశాచి పీడ కలుగుతుందని చెబుతారు. వైద్యవృత్తి పేరుతో మోసం చేసినా, పాములకు ఏమైనా హాని చేసినా రాహువుకు కోపం వస్తుందని చెబుతారు. నవగ్రహాలకు కోపం వచ్చే పనులు చేయకుండా, నవగ్రహాలు ప్రసన్నమయ్యే పనులు చేస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications