ఎల్లుండి నాగపంచమి... ఇలా చేయండి
ఈనెల 21వ తేదీన నాగపంచమి. ఈ పండగ విశిష్టత ఏమిటి? దీనిని ఎలా జరుపుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. నాగపంచమి గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైంది. ఆరోజు ద్వారానికి ఇరువైపులా నాగదేవత చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
చతుర్ధి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం లేదా వెండి లేదా కర్ర లేదా మట్టితో వారివారి తాహతును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసువు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలను గన్నేరు, సంపెంగ, జాజి పూలతో పూజించాలి. అలాగే పాలు, పాయసాన్ని నివేదించాలి. శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు నాగపంచమి జరుపుకుంటారని శాస్త్రం చెబుతోంది.

కార్తీకమాసంలో వచ్చే శుక్షపంచమినాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదే అని పండితులు తెలియజేస్తున్నారు. శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగ చతుర్ధి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని చేయాలి.
నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజ గదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితో, పాలతోను అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా ఇవ్వాలి. పూజ తర్వాత బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోజు రాత్రి జాగరణ చేయాలి. ఇలా చేసినవారిని నాగరాజులు అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పాపాలనుంచి విముక్తి లభించడం, సర్పభయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి. .












Click it and Unblock the Notifications