నేటి నుండే ధనుర్మాసం: శూన్యమాసంలో వివాహాలకు బ్రేక్.. కారణం ఇదే!!
దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమైంది. నేటి నుండి ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలరోజులు విష్ణుమూర్తిని భక్తులు విశేషంగా పూజిస్తారు. అయితే పవిత్రమైన ఈ ధనుర్మాసంలో పెళ్లిళ్లు చేయడం నిషిద్ధమని చెబుతారు. పవిత్రమైన ధనుర్మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయకూడదు? ఎందుకు ఈ మాసాన్ని శూన్య మాసంగా చెబుతారు వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
2023 డిసెంబర్ 16 అర్ధరాత్రి 12 గంటల 34 నిమిషాల నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది అంటే ధనుర్మాసం మకర సంక్రాంతి పర్వదినం తో ముగుస్తుంది. ఈ సంవత్సరం ధనుర్మాసం మార్గశిర లో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది. సహజంగా ధనుర్మాసం పుష్య మాసంలోనే ఉంటుంది. పుష్య మాసం వివాహాలు చేయడానికి నిషిద్ధ మాసం.

కానీ ఈ సంవత్సరం మార్గశిర మాసంతో ప్రారంభం కావడంతో కొన్ని వివాహ ముహూర్తాలు ఉన్నట్టు, పెళ్లిళ్లు చేయడంలో దోషమేమి లేదని చెబుతున్నారు. అయితే పుష్యమాసం తో కూడిన ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకు శూన్య మాసంలో పెళ్లిళ్లు చేయకూడదు అంటే ఈ మాసంలో ప్రజలందరూ తిరుప్పావై వ్రతాన్ని నిష్టగా పాటిస్తారు. ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలను సాక్షాత్తు అమ్మవారే చెప్పారని చెబుతారు.
భోగభాగ్యాలకు దూరంగా ఉంటూ, దానధర్మాలు చేస్తూ, మోక్షమార్గంలో పయనిస్తూ, మనసు మొత్తం విష్ణుమూర్తి పై లగ్నం చేసి భక్తి భావంతోనే జీవించాలని చెప్పారని, అందుకే వివాహాది వేడుకలు భోగభాగ్యాలకు అలవాలం కాబట్టి ఈ మాసంలో చేయకూడదని చెబుతారు . శూన్య మాసంలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహప్రవేశాలు, నిశ్చితార్థం, వివాహాది శుభకార్యాలు చేయకూడదని, ఈ షరతులు భగవంతుని పైన మనసు లగ్నం చేయడానికి మాత్రమే చెబుతున్నారు.
ఈ మాసం మొత్తం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాలు ముగించుకుని వేకువజామునే పూజలు చేసి సూర్యోదయానికి ముందే పూజలను పూర్తి చేస్తారు. దీనిని ధనుర్మాస పూజ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి కటాక్షం ఉంటుందని భక్తులు విశేషంగా నమ్ముతారు. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని విశ్వసిస్తారు. నెలరోజుల పాటు అత్యంత భక్తితో విష్ణువుని పూజించేందుకే ధనుర్మాసాన్ని శూన్యమాసంగా చెప్పి వివాహాది శుభకార్యాలకు బ్రేక్ వేస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications