Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాఘమాసం ప్రత్యేకత పవిత్ర స్నానం: ఈ పవిత్ర స్నానంను ఎలా ఆచరించాలి..?

మహామాఘీ

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది. కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. "మా - అఘం'' అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.

మాఘ స్నాన స్తోత్రం :-

"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''

"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.

హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 16 న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.

Maghamasam season known for Holy bath, What is the procedure to attain holy bath

"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ

బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''

"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును'' అని అర్థం. అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.

మాఘపూర్ణిమ - మహామాఘి:- మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం "మాఘపూర్ణిమ'' నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.

సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే "నదీనాం సాగరో గతి:'' సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ'' లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. "స్నానం'' అంటే "షవర్ బాత్'' చేయడమో , "స్విమ్మింగ్ పూల్'' లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.

సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి "నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి" అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో "మాఘ పూర్ణిమ'' స్నానం ముఖ్యమైనది.

సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ "గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం.

మాఘ పూర్ణిమ స్నానఫలం :-

1 . ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.

2 . బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.

3 . చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.

4 . సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

5 . పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

6 . సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

7 . గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

8 . ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.

9 . సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.

ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+