మార్గశిర అమావాస్య నేడే.. పితృ దోషం, కాలసర్ప దోషాలకు నేడు ఈ పరిహారాలు చెయ్యండి!!
ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య మార్గశిర అమావాస్యగా చెబుతారు. ఈసారి మార్గశిర అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది . నేడు మార్గశిర అమావాస్య కావడం అందునా గురువారం రోజు మార్గశిర అమావాస్యరావడం చాలా విశేషంగా పరిగణించబడుతుంది. అయితే ఈ విశేషమైన దినాన కొన్ని పనులు చేస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయని సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
10 జనవరి 2024, రాత్రి 10:25 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. 11 జనవరి 2024, సాయంత్రం 5:27 గంటలకు అమావాస్య తిథి ముగుస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం, ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి జనవరి 11వ తేదీన గురువారం నాడు మార్గశిర అమావాస్య గా జరుపుకుంటారు.

మార్గశిర అమావాస్య రోజున కాలసర్పదోషంతో బాధపడేవారు కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందాలంటే విష్ణువుని ఆరాధించాలి. గంగాజలంతో విష్ణువుకు పూజ చేయాలి. విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తిని మార్గశిర అమావాస్య రోజు అత్యంత నిష్టతో ఉపవాస దీక్షతో పూజించటం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుంది.
అంతేకాదు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్లు నాగ ప్రతిష్ట చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మార్గశిర అమావాస్య రోజు పితృ దోషాలు తొలగించుకునేందుకు కూడా పరిహారాలు సూచించబడ్డాయి. మార్గశిర అమావాస్య నాడు నదిలో గాని కొలనులో గాని స్నానం చేసిన తర్వాత పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. రాగి పాత్రలో ఎరుపు రంగు పూలు, నువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
ఈరోజు పితృదేవతలకు నైవేద్యం సమర్పించడం వల్ల, పిండ ప్రధానం చేయడం వల్ల పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆత్మకు కూడా శాంతి లభిస్తుంది. కాబట్టి మార్గశిర అమావాస్యనాడు పితృ దోషాలు కాలసర్ప దోషాలు పోవాలంటే పైన చెప్పినవి విధిగా నిర్వర్తించి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.ఈ పర్వ దినాన సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, నదీ స్నానం చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications