ధనత్రయోదశి 2023 ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం, ప్రాముఖ్యత!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి నాడు ధన త్రయోదశి లేదా ధన్ తేరాస్ పండుగను జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవి, గణేశుడు మరియు ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన త్రయోదశి రోజున ప్రజలు తమ సామర్థ్యాన్ని బట్టి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు దేవతలకు భగవంతుడు అయిన ధన్వంతరిని పూజిస్తారు ఎందుకంటే ఈరోజునే ధన్వంతరి జన్మించారని, ధన్వంతరి జయంతి వేడుకలను నిర్వహిస్తారు.ఇక మహిళలందరూ అత్యంత ప్రత్యేకంగా చూసే ధన త్రయోదశి ఈ సంవత్సరం ఏ తేదీన వస్తుంది? పూజకు శుభ సమయం ఏమిటి? పండుగ ప్రాధాన్యత ఏమిటి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ధన త్రయోదశి పండుగను నవంబర్ 10వ తేదీన జరుపుకుంటారు.
ఇక ధన త్రయోదశి పూజ ముహూర్తంగా సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి, రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు నిర్ణయించారు. ఇక ధన త్రయోదశి ప్రదోషకాలం విషయానికి వస్తే సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈసారి లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ధన త్రయోదశి జరుపుకోనున్నాం.
హిందూ పురాణాలలో ధన త్రయోదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. దీపావళికి ముందు జరుపుకునే ఈ ప్రధానమైన పండుగ ధన త్రయోదశికి చాలా విశేషం ఉంది. ఎవరైతే అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో వారు సంపన్నులుగా జీవిస్తారని, సుఖ శాంతులతో ఉంటారని చెబుతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications