నాకూ బాధగానే ఉంది: చంద్రబాబు
హైదరాబాద్: పార్టీ నాయకులు త్యాగాలు చేయక తప్పదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెసును ఓడించడానికి ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని, దీని వల్ల తన కుటుంబ సభ్యులకు, ముఖ్యమైన నాయకులకు కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయానని ఆయన చెప్పారు. ప్రస్తుతం టిక్కెట్లు లభించనివారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొంత మంది ముఖ్యమైన నాయకులకు టిక్కెట్లు ఇవ్వలేకపోవడం తనకు కూడా బాధగానే ఉందని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి ఆదినుంచి సేవ చేసిన ఎందరికో పొత్తులమూలంగా ఈసారి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న శ్రీపతి రాజేశ్వర్‌కు టిక్కెట్ ఇవ్వని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారందరికీ భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలలో పలుచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించారు.