జూనియర్ ఆర్టిస్ట్ అనంతలక్ష్మి హత్య
హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్ అనంతలక్ష్మి హత్యకు గురయ్యారు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఈమె నెలరోజులుగా కనిపించటం లేదు. దీనిపై రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి రవికుమార్ అనే ప్రొడక్షన్ మేనేజర్‌ను, అతని ప్రియురాలు వాసంతి అనే మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తామే ఈ హత్య చేసినట్లు వారు అంగీకరించారు. తామే ఆమెను చంపి గోనెసంచిలో పెట్టి మూసాపేటలోని ఓ మురికికాలువలో పడేసినట్లు చెప్పారు.
ఆమె వద్ద ఉన్న నగలకోసమే తాము ఈ హత్య చేసినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పడేసిన మూసాపేటలోని మురికికాలువను కూడా వారు పోలీసులకు చూపించారు. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.