మేధస్సుకు హద్దలు వద్దు : గేట్స్
న్యూఢిల్లీ : అమెరికా వలసవాద చట్టాలను కఠినతరం చేయాలనుకోవడం పెద్ద పొరపాటే అవుతుందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరించారు. మేధోసంపత్తి ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా తరలిపోగల స్వేచ్ఛ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత పర్యటనలో ఉన్న బిల్‌గేట్స్ శుక్రవారం భారత ఐటి సంస్థల వేదిక నాస్కామ్ ప్రతినిధులతో కలిసి ఉమ్మడిగా పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వలసవాద చట్టాల విషయంలో అమెరికన్ కాంగ్రెస్ కఠిన వైఖరి అవలంబించడాన్ని తప్పు పట్టారు.
ఆత్మరక్షణ ధోరణుల్లో భాగంగా వీసా నిబంధనలు కఠినతరం చేయడం చారిత్రక తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుసరిస్తున్న బెంగళూరుకు నో.. దేశీయ ప్రతిభకు సై.. సిద్ధాంతం పట్ల నాస్కామ్ ఆందోళనకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల మార్కెట్ అనేది ఒక ప్రాంతానికే పరిమితం అయింది కాకపోవడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. వలసవాద చట్టాలు కఠినతరం చేయడాన్ని తమ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమొక్రాటిక్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నాటి నుంచి అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను ఔట్‌సోర్సింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి ప్రత్యేకమైన గుర్తింపు నంబర్ అందించేందుకు ఉద్దేశించిన యూనిక్ ఐడి ప్రాజెక్టులో తాము కూడా భాగస్వాములు కావాలనుకుంటున్నట్టు బిల్‌గేట్స్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications