హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉవ్వెత్తున ఎగిసి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ సెలవుల నుంచి పాఠశాలలను మినహాయించింది. అయితే శుక్రవారం చాలా పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. తెలంగాణకు మద్దతుగా పాఠశాలలను మూసేయాలని ప్రైవేట్ పాఠశాలల యాజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. సెలవులు ప్రకటించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లను మూసేయాలనే నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కారణంగా హాస్టళ్లను మూసేసే నిర్ణయాన్ని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరుపతిరావు వెనక్కి తీసుకున్నారు.
సెలవులు ప్రకటించినప్పటికీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతివ్వాలని కోరుతున్నారు. వరంగల్ లో విద్యార్థులు మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించారు. నల్లగొండలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విద్యార్థులు ధర్నా చేశారు.