హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి వేళల్లో విద్యుత్ కోత ఉండదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ కోత లేకుండా చూస్తామని ఆయన సోమవారం శానససభలో చెప్పారు. విద్యార్థుల సౌకర్యం కోసం రాత్రిపూట విద్యుత్ కోత లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. పరీక్షలు దగ్గర పడడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
విద్యుత్ కోతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగానికి, ఉత్పత్తికి మధ్య ఆరు శాతం తేడా ఉందని ఆయన తెలిపారు. దీంతో విద్యుత్ కోత విధించక తప్పడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నగరంలో రెండు గంటలు, పట్టణాలు, మండలాల్లో నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ కోత ఉంటుందని ఆయన చెప్పారు. వారానికో రోజు పరిశ్రమలకు విద్యుత్ హాలీడే ప్రకటించినట్లు ఆయన తెలిపారు.