రాజమండ్రి: యార్లగడ్డ లకీ ప్రసాద్ ద్రౌపది నవలను విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా ప్రకటిస్తే వారు చెడిపోతారని రిటైర్డు రీడర్ డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ అన్నారు. స్థానిక వీరేశలింగం టౌన్ హాలులో ఆదివారం ఉదయం కళాగౌతమి ఆధ్వర్యంలో ద్రౌపది నవలపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. యార్లగడ్డ నవల వ్యాస, కవిత్రయ భారతాలకు విపరీత వ్యాఖ్యానంగా సాగిందన్నారు. నవలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. కళా గౌతమి వ్యవస్థాపకుడు బీవీఎస్ మూర్తి మాట్లాడుతూ ఆంధ్ర మహా భారతం విరచించిన నేల రాజమహేంద్రి అని, ఇటీవల ద్రౌపది నవలపై వినబడుతున్న సంచలన వార్తలకు సమాధానంగా సాహితీ రసజ్ఞుల చర్చా గోష్టిని తాము ఏర్పాటు చేశామన్నారు.
వాచస్పతి, రాష్ట్రపతి పురస్కార్ గ్రహీత మధుర కృష్ణమూర్తి శాస్త్రి తనయుడు మధుర పాలశంకరశర్మ ప్రసంగిస్తూ ద్రౌపది నవల మన సంప్రదాయాలపై దాడి చేసేలా ఉందన్నారు. నవల నిషేధానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకి మాట్లాడుతూ యార్లగడ్డ తన అవార్డును తిరిగి ఇచ్చేయాలని, మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారగ్రహీత సీబీవీఆర్‌కే శర్మ మాట్లాడుతూ 'మార్మిక సిద్ధాం తానికి' అనుగుణంగా ద్రౌపది నవల రచించారన్నారు.