న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును ఈ నెల 16వ తేదీలోగానే లోకసభలో ప్రతిపాదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు. లోకసభలో ప్రతిపాదించడానికి ఎక్కువ సమయం తీసుకోబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలైన ఆ బిల్లుకు చట్టప్రతిపత్తి కల్పించడానికి యుపిఎ ప్రభుత్వం వేగిరంగా ముందుకు కదులుతోంది.
బిల్లును ఏప్రియల్ 7వ తేదీ తర్వాతనే లోకసభలో ప్రతిపాదించవచ్చునని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం అంత జాప్యం చేయదలుచుకోలేదని బన్సాల్ ప్రకటనను బట్టి తెలుస్తోంది. మహిళా బిల్లు లోకసభలో ఆమోదం పొందడాని ఏ విధమైన ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. తగిన సంఖ్యాబలం లోకసభలో ఉన్నందున అది సమస్య కాదని అంటున్నారు.