కడప: కడప జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఈ ప్రమాదం సంభవించింది. పుల్లంపేట మండలం లింగారెడ్డి గ్రామానికి చెందిన కొంత మంది ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి జీపులో తిరుగు ప్రయాణమయ్యారు. రెడ్డిపల్లె చెరువుకట్ట వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఆ జీపును ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో లక్ష్మీకర్, వెంకటసుబ్బమ్మ, పెంచలయ్యలతో పాటు రామిరెడ్డి అనే బాలుడు అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడిన వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆస్పత్రికి తరలించారు.