హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ క్యాంప్ శాననసభ్యులకు షాక్‌కు అధిష్టానం రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్తున్న తమ పార్టీ శాసనసభ్యులకు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెసు అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది కాంగ్రెసు శాసనసభ్యులు కొంతకాలంగా బహిరంగంగానే కాంగ్రెసు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జగన్ వెంట వెళ్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్‌ సాగిస్తున్న ఆందోళనల్లో వీరు భాగస్వాములవుతున్నారు. జగన్‌ ఏకంగా 24 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో ఢిల్లీలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడంతో అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. అప్పట్నుంచే వేగంగా పావులు కదుపుతూ ప్రజారాజ్యం, మజ్లిస్‌ పార్టీల మద్దతుపై చర్చలు జరిపింది. ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఆ రెండు పార్టీలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే తొలుత ప్రరాపాను మంత్రివర్గంలోకి తీసుకుంటామని, ఆ తరువాత ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించింది.

ప్రజారాజ్యం, మజ్లీస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వానికి ఢోకా ఉండదనే భావనతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ వర్గంలో బాగా దూకుడుగా ఉన్న వారిపై పార్టీపరంగా చర్యల కంటే, అనర్హత వేటు వేసేలా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధ్యక్షురాలిపైనే విరుచుకుపడుతూ ప్రభుత్వాలను తూర్పారపడుతున్నా ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎమ్మెల్సీకి కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్‌ చేతకానితనంగా జగన్‌ శిబిరం భావిస్తూ వస్తోంది. ఈ పరిస్థితిని గమనించి మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్‌ వర్గం గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు అధిష్ఠానం, ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు రంగంలోకి దిగారు. జగన్‌ వర్గాన్ని నిలువరించేందుకు అన్ని రకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పలు ఆకర్షణలతో జగన్‌ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేల్లో కొందరికి వాస్తవ పరిస్థితి వివరించి, తిరిగి పార్టీవైపు తిప్పుకునేందుకు కిరణ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో జగన్‌ వెంట వెళ్ళిన ఇద్దరు ఎమ్మెల్యేలు షాజహాన్‌, రవిలు ఆదివారం కిరణ్‌ ఆ జిల్లాలో నిర్వహించిన రచ్చబండలో పాలుపంచుకున్నారు. జగన్‌ దీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు కాంతారావు, కుంజా సత్యవతిలు జిల్లా మంత్రి వెంకటరెడ్డితో వచ్చి సీఎంతో భేటీ అయి వెళ్ళారు. అదేవిధంగా జగన్‌ మద్దతుదారునిగా భావించే కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నియోజకవర్గంలోనే సీఎం రచ్చబండ నిర్వహించారు. ఇక కడప తరవాత అత్యధికంగా జగన్‌కు తొలుత మద్దతు తెలిపిన పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేల్లో ముగ్గురు కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు ఇదే పద్ధతి పాటిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటేసిన తెరాస శాసనసభ్యులపై వేటు వేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని అనర్హునిగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అదే తరహాలో జగన్‌ వర్గంగా వ్యవహిరిస్తున్న ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలనే కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలిగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు. దీంతో మిగిలిన ఆ వర్గ ఎమ్మెల్యేలు భయపడి కొంత దూరంగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ లెక్కలేకుండా వ్యవహరిస్తే అటువంటి వారందరిపై ఇదే విధంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. ఈ పరిస్థితి వచ్చినా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ముందుగా ప్రజారాజ్యం, మజ్లిస్‌ పార్టీల మద్దతు పొందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X