హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి సాధించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan and Kiran kumar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి సాధించారనే ప్రచారం ముమ్మరమైంది. వైయస్ జగన్ సోమవారం ప్రారంభించిన పోలవరం హరిత యాత్రకు హాజరైన శానససభ్యుల సంఖ్య డజను కూడా లేని స్థితిలో ఈ ప్రచారం మరింతగా సాగుతోంది. ప్రస్తుత స్థితి చూస్తుంటే ముఖ్యమంత్రిగా రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం సత్ఫలితాలు ఇస్తోందని అంటున్నారు.

వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను ఏదో రీతిన బుజ్జగిస్తూ వారి మనసులు మార్చడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారనే మాట వినిపిస్తోంది. అందుకు మంత్రులను కూడా ఆయన సమర్థంగా వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన డిఎల్ రవీంద్రా రెడ్డి మాత్రమే కాకుండా వైయస్ హయాంలో కూడా మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి నుంచి కూడా ఆయనకు సహకారం అందుతోంది. ఈ రకంగా రోశయ్యకు కన్నా మంత్రుల సహకారం సాధించడంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ ఫలితం సాధించారని అంటున్నారు.

కాగా, రచ్చబండ కూడా కిరణ్ కుమార్ రెడ్డి సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోశయ్యకు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతటి వ్యతిరేకత కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించడం లేదని చెబుతున్నారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు తగిన సందేశమిస్తూనే వైయస్ జగన్‌ను ఆయన టార్గెట్ చేసుకుని మాట్లాడడం కూడా మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో జగన్‌పై గతంలో కన్నా మంత్రులు, శాసనసభ్యులు తీవ్రంగా ఎదురు దాడి చేస్తున్నారని అంటున్నారు. ఏ దారి లేక జగన్ గోదావరి బాట పట్టారని టిజి వెంకటేష్ వంటి మంత్రులు అనడాన్ని ఉదహరిస్తున్నారు. తెలంగాణలో వ్యతిరేకత ఎదురైనప్పటికీ క్రమంగా దాన్ని తగ్గించే దిశగా కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ సాగిందని అంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాలు సజావుగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కడప, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. వైయస్ ప్రాబల్యాన్ని క్రమక్రమంగా తగ్గించే విధంగా, దాన్ని జగన్ వాడుకునే విషయంలో ప్రతి విమర్శలు ఎదురయ్యేలా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్నాయి. మొత్తం మీద, చాలా వరకు కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్‌పై ఆధిపత్యం సాధించినట్లు కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X