కోర్టుకు సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తుల వివరాలు, మల్లగుల్లాలు

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్.భగవతి ట్రస్టు సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. భారతీయ వారసత్వచట్టం 317 నిబంధన ప్రకారం ఇన్వెంటరీ అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆస్తులకు సంబంధించిన సమస్త వివరాలుగల జాబితాను జిల్లా కోర్టులో దాఖలు చేస్తారు. జిల్లా న్యాయమూర్తికి అందజేసిన ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించాల్సిన అవసరంలేదు. అందులో వివరాలు తెలియకుండా ఆరోపణలు చేయడానికి వీలుండదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇన్వెంటరీ దిశగా ట్రస్టు అడుగు లేస్తున్నట్లు తెలిసింది.
ట్రస్టు నిర్వహణలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాబా సోదరుని కుమారుడు రత్నాకర్ ఇప్పటికే ట్రస్టుసభ్యునిగా ఉన్నాయి. బుధవారం బాబా అంత్యక్రియలను కూడా ఆయనే నిర్వహించారు. భవిష్యత్తులో ట్రస్టులో ఈయన కీలకంగా మారతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబా సోదరి కుమార్తె చైతన్య రాజు ఈశ్వరమ్మ ట్రస్టు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈమె కూడా సత్యసాయి ట్రస్టులో కీలక స్థానం కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ట్రస్టు కార్యక్రమాలు సవ్యంగా జరిగినంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి జోక్యం చేసుకొనే అవకాశంలేదు. మంగళ, బుధవారాల్లో పుట్టపర్తిలో ఉన్న ముఖ్యమంత్రితో సత్యసాయి ట్రస్టుతో సంబంధమున్న కొందరు మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. బాబాకు అన్నిరకాల సఫర్యలు చేస్తూ సన్నిహితునిగా గుర్తింపు పొందిన సత్యజిత్‌ను పూర్తిగా దూరంగా పెట్టేలా చూడాలని కొందరు ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ట్రస్టులో జోక్యం చేసుకొనే అవకాశం లేదంటూనే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.